
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధం వద్దని మందలించడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన ఓ మహిళ(28) అదే ఊరికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు.
దీంతో భర్త ఈ నెల 1న సాయంత్రం భార్య కుటుంబీకులను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబీకులు తలుపులు తీసి చూడగా అప్ప టికే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మెదక్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.