
ఆమె మృతికి ప్రియుడే కారణమని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్‌రెడ్డి కూడా ఎల్‌బీనగర్‌లోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్‌రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్‌రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్‌రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.
మృతదేహంతో ఆందోళన..
అశ్విని మృతికి సురేష్‌రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్‌రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్‌రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.