
కామారెడ్డి జిల్లా: తరచూ కుమారుడు తిడుతుండటంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ స్రవంతి తెలిపిన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన చింతల సాయిలు తన తల్లి చింతల లక్ష్మి (70)ను తరచూ తిడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తిండి పెట్టకుండా తల్లిని వేధించాడు. సూటిపోటి మాటలతో ఎందుకు బతికున్నావ్.. చనిపో అంటూ దూషించేవాడు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మి జీవితంపై విరక్తి చెంది.. సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో కుమారుడు తల్లిని తిట్టడం, చనిపొమ్మంటూ వేధించడంతో ఆమె మనోవేదనకు గురయినట్లు తేలిందని ఎస్‌ఐ వివరించారు. పోలీసులు సాయిలుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.