
కదలికలను గమనించి.. కళ్లలో కారం కొట్టి
పుస్తెలతాడు చోరీ
దుండగుడిని పట్టుకున్న కార్ వాషింగ్ సెంటర్ నిర్వాహకుడు
నిందితుడికి రిమాండ్
రంగారెడ్డి జిల్లా: కొన్నాళ్లుగా మహిళ కదలికలను గమనిస్తున్న ఓ దుండగుడు ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి పుస్తెలతాడును అపహరణకు యత్నించాడు. పారిపోతున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం శంకర్‌పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గాన్‌కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లికి వచ్చారు.
పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరిగానే టిఫిన్ సెంటర్‌కు వచ్చిన సునీత పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేందుకు ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగుడు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సునీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకుని తనిఖీ చేశాడు.
బ్యాగులో కారం పొడి, మంకీక్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.