
సాక్షి, రంగారెడ్డి: ఇంకెన్నాళ్లు టోక్యో, న్యూయార్క్ అంటూ గొప్పలు చెప్పుకుంటామని.. భావితరాలకూ అలాగే ఓ నగరం ఉండాలనే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.
ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. చేయకూడని రాద్ధాంతాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్‌కు భూములు ఉన్నాయని, అందుకే నగరాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. భూములుంటే దాచితే దాగేది కాదు. రికార్డుల్లో ఉంటాయి. అందరికీ తెలిసిపోతుంది. కుతుబ్‌షాహీలు నగరాన్ని నిర్మిస్తే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి నాయకులు ఆలోచన చేశారు. అలాంటి వాళ్లు మాకెందుకులే అనుకుని ఉంటే ఇవాళ ఓఆర్‌ఆర్, శంషాబాద్‌లు ఏవీ వచ్చేవి కావు.
గత అనుభవాలు పునాది కావాలి. భూముల విలువ నాకు తెలుసు. నేను ఎవరికీ అన్యాయం చేయను. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. ఫ్యూచర్ సిటీకి స్థానికులు సహకరించాలి. ఇంకెన్నాళ్లు న్యూయార్క్, టోక్యో నగరాలంటూ మాట్లాడుకుందాం. ఎందుకు మనమే ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవద్దు. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తాం. బుల్లెట్ రైలు వచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాం. ఫ్యూచర్ సిటీ మన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం అని సీఎం రేవంత్ అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ నుంచి బందరుపోర్ట్ వరకు అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం రోడ్డు మంజూరు చేయించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పనులు ఫ్యూచర్ సిటీ లో జరగనున్నాయి. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి తలమానికం కానుంది. రేవంత్ రెడ్డి సంకల్పం త్వరితగతిన పూర్తికావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రణాళిక బద్దమైన నగరంగా చండీఘడ్ నిర్మించారు. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. వాణిజ్యం, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. స్పోర్ట్స్ క్యాపిటల్ చేసే విధంగా క్రీడా విశ్వవిద్యాలయం అందేలా చర్యలు చేపడతాం. జీరో పోల్యూటెడ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీ గా రూపుదిద్దడానికి స్థానికులు భాగస్వాములు కావాలని కోరుతున్నా అని ప్రసంగించారు.
ఇదీ చదవండి: ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోండి