
రెండు బైకులు ఢీ
ముగ్గురు యువకుల మృత్యువాత
తుక్కుగూడ వద్ద ఔటర్ సర్వీస్ రోడ్డులో ప్రమాదం
పండుగ షాపింగ్ చేసుకుని వెళ్తుండగా ఘటన
పహాడీషరీఫ్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయాలపాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన కొండ రామకృష్ణ కుమారుడు అరుణ్ (24) సాయంత్రం 6.30 గంటలకు తన పల్సర్ బైక్ (టీజీ 08సి 4722)పై పెద్ద గోల్కొండలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు.
ఇదే సమయంలో హర్షగూడకు చెందిన ఇస్లావత్ నరేష్ కుమారుడు, స్కూల్ బస్సు క్లీనర్‌గా పనిచేసే మోహన్ (18), రమావత్‌నర్స్ కుమారుడు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధూ(17), ఇస్లావత్ సేవ్య కుమారుడు సింహాద్రి (17) యూనికార్న్ బైక్ (టీఎస్07జేఏ 9052)పై పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు హర్షగూడ నుంచి తుక్కుగూడకు వస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వెళ్తున్న వీరి బైక్‌లు.. అవుటర్ సర్వీస్ రోడ్డులోని పీవీఆర్ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదంలో అరుణ్‌తో పాటు యూనికార్న్ నడిపిన సిద్ధూ, వెనుక కూర్చున్న మోహన్‌లు దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన సింహాద్రిని వెంటనే ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మోహన్, సిద్ధూ వరుసకు బావ బావమరుదులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.