
డెంగీ.. డేంజర్
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాల్లో విష జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర, జిల్లా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ పారిశుధ్య నిర్మూలన పూర్తిస్థాయిలో నిర్మూలించలేకపోతున్నారు. గ్రామంలో మురికి కాల్వలు శుభ్రం చేసినప్పటికి ఇళ్ల మధ్య, పక్కన ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి గడ్డి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. గడ్డి మందు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల్లో డెంగీ లక్షణాలతో ముగ్గురు మృతి చెందగా, 350 మంది వరకు జ్వరాల బారిన పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా గత నెల 24న కలెక్టర్ హైమావతి గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై పలు సూచనలు చేశారు. అలాగే అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డీపీఓ దేవికీదేవి, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, రాష్ట్ర మలేరియా అదనపు డైరెక్టర్ అమర్‌సింగ్‌నాయక్ గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కానీ పారిశుద్ధ్య నిర్మూలనకు నిధులు మాత్రం కేటాయించలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం తిమ్మాపూర్‌లో మాజీ సర్పంచ్ నవ్యసుమన్, అనంతసాగర్‌లో గ్రామస్తులు కలిసి బ్లీచింగ్ పౌడర్‌ను కొనుగోలు చేసి ఉరంతా పిచికారీ చేశారు. ప్రతి రోజు మండల శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
మరో ముగ్గురికి డెంగీ..
తిమ్మాపూర్, అనంతసాగర్‌లో ఈ నెల 17 నుంచి వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజు వైద్యులు జ్వర బాధితులకు రక్త నమునాలు సేకరిస్తూ.. డెంగీ లక్షణాలు ఉన్న వారిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం తిమ్మాపూర్‌లో 75 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి డెంగీ లక్షణాలు కనిపించాయని డాక్టర్ కిరణ్ తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతసాగర్‌లో 43 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రస్తుతం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు గ్రామాలకు చెందిన 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో ముగ్గురికి లక్షణాలు
తిమ్మాపూర్, అనంతసాగర్‌లో
తగ్గని జ్వరాలు
కొనసాగుతున్న వైద్య శిబిరాలు
పారిశుధ్య నిర్మూలన అంతంతే

డెంగీ.. డేంజర్