ఆర్టీసీ డ్రైవర్‌.. నో ఫోన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌.. నో ఫోన్‌

Sep 2 2025 11:04 AM | Updated on Sep 2 2025 11:04 AM

ఆర్టీసీ డ్రైవర్‌.. నో ఫోన్‌

ఆర్టీసీ డ్రైవర్‌.. నో ఫోన్‌

ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఆర్టీసీ సంస్థ డ్రైవర్లకు సెల్‌ఫోన్‌ వాడకాన్ని నిషేధిస్తూ చర్యలు చేపట్టింది. విధినిర్వహణలో ఉన్న డ్రైవర్‌ తన వద్ద సెల్‌ఫోన్‌ కలిగి ఉండకుండా చూస్తుంది. ప్రయోగాత్మకంగా మొదట 11 డిపోల్లో అమలు చేస్తుంది. విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది.

– నారాయణఖేడ్‌:

మెదక్‌ రీజియన్‌లో సంగారెడ్డి డిపోలో పైలెట్‌ ప్రాజెక్టుగా సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ డిపోలో విధులు నిర్వహిస్తున్న 161మంది డ్రైవర్లు డ్యూటీ సమయంలో సెల్‌ఫోన్‌ను డిపోలో డిపాజిట్‌ చేసి వెళ్తున్నారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడటం వల్ల జరిగే ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ నిబంధన అమలు చేస్తుంది. పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే రీజియన్‌ పరిధిలోని 8 డిపోల్లో అమలు చేయనుంది. ఈ డిపోల పరిధిలో 569 సర్వీసులకు గాను 577మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు.

డ్రైవర్లకు పరీక్షలు

ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు చర్యలు చేపట్టింది. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు రెగ్యులర్‌గా డ్రైవింగ్‌ పరీక్షలు చేసి, తగు శిక్షణ ఇస్తున్నారు. రెండు నెలలకోసారి సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు హకీంపేట్‌లో ఆరు నెలలకోసారి డ్రైవింగ్‌ పరీక్ష కూడా పెడుతున్నారు. ప్రతి డిపోలో డ్యూటీకి వెళ్లే సమయంలో డ్రైవర్‌కు బ్రీతింగ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. 45 ఏళ్లు నిండిన డ్రైవర్లకు ఏడాదికి ఒకసారి, 45 ఏళ్లలోపు వారికి మూడేళ్లకు ఒకసారి జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటేనే వారిని విధులకు పంపిస్తారు. తెల్లవారు జామున విధులకు వెళ్లే డ్రైవర్లు రాత్రి వచ్చి పడుకునేందుకు, డబుల్‌ డ్యూటీకి వెళ్లే వారు విశ్రాంతి తీసుకొనేందుకు ప్రతి డిపోలో రెస్టు రూంలు ఏర్పాటు చేశారు. ఏవైనా పండుగల సందర్భంలో స్పెషల్‌ బస్సులు నడిపే క్రమంలో ఆహారం అందజేస్తున్నారు.

భద్రతకు ప్రాధాన్యం..

విధుల్లో ఉన్న సమయంలో కొందరు డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడుతున్నట్లు ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగం తనిఖీల్లో వెల్లడైంది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తూ యాజమాన్యం సెల్‌ఫోన్‌ వినియోగం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం డ్రైవర్లు విధులకు హాజరైన వెంటనే సెల్‌ఫోన్‌లను డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాకర్‌లో భద్రపర్చాలి. విధులు పూర్తయిన తర్వాత తమ ఫోన్లను తిరిగి తీసుకోవాలి. ఒకవేళ డ్రైవర్‌కు ఏదైనా అత్యవసర సమాచారం అందించాల్సి వస్తే అధికారులు లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత బస్సు కండక్టర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కండక్టర్‌ ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్‌కు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు.

అమలు ప్రారంభం

సంగారెడ్డి డిపోలో డ్రైవర్లకు సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధాన్ని ప్రారంభించాం. డ్రైవర్లే సంతోషంగా సెల్‌ఫోన్‌ను ఇచ్చి విధులకు వెళుతున్నారు. ఇది మంచి నిర్ణయంగా స్వాగతిస్తున్నారు. ప్రయాణికులు, ప్రజల భద్రత, కార్మికుల సంక్షేమం కోసం సంస్థ పాటుపడుతుంది.

– విజయభాస్కర్‌, ఆర్‌ఎం, సంగారెడ్డి

బస్సు నడిపే వేళ నిషేధం

విధిస్తూ సంస్థ నిర్ణయం

ప్రయోగాత్మకంగా మెదక్‌ రీజియన్‌ సంగారెడ్డిలో ప్రారంభం

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement