
మందేసి.. చిందేసిన అధికారులు
హత్నూర(సంగారెడ్డి): అధికారులు మందు తాగి చిందులేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బోరుపట్ల గ్రామ శివారులోని మంజీరా ఫిల్టర్ బెడ్‌లో నీటి సరఫరా గ్రిడ్ కాంట్రాక్టర్, అధికారులు సోమవారం రాత్రి మందేసి చిందులేశారు. రెండు, మూడు రోజుల నుంచి తాగునీరు రాక హత్నూర, నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఫిల్టర్ బెడ్‌లో మందు తాగుతూ చిందులేసారని బోరుపట్ల గ్రామస్తులు తెలిపారు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని బార్‌గా మార్చుకొని మద్యం తాగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్‌లో సాయంత్రం ఆరు తర్వాత స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నారని, ఎవరిని ఇబ్బంది పెట్టలేమని గ్రిడ్ కాంట్రాక్టు మేనేజర్ జగపతిబాబు స్థానికుల సమక్షంలోనే తెలుపడం గమనార్హం. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్‌లోనే మందు తాగుతూ చిందులేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.