
ఏ ఎన్నిక ముందు.!
హత్నూర( సంగారెడ్డి): ఏ ఎన్నిక ముందు.. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొస్తాయి? ప్రభుత్వం రోజుకో లీకుతో గ్రామస్థాయిలో నాయకులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో 613 గ్రామపంచాయతీలకు 5370 వార్డులు, 271 ఎంపీటీసీ స్థానాలు, 25 ఎంపీపీలు , జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఓటరు జాబితాను సైతం గ్రామాల్లో ఏర్పాటు చేసింది. అలాగే ఎంపీటీసీ ఎన్నికలకు ఓటర్ లిస్టును అధికారులు సిద్ధం చేశారు. కానీ ఏ ఎన్నికలు ముందు వస్తాయో ప్రభుత్వం తేల్చకపోవడంతో మండల, గ్రామస్థాయి నాయకులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ముందు ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేయాలన్న ఆలోచనలో నాయకులు ఉన్నారు. మరికొందరు ఎంపీటీసీ వస్తే పోటీ చేద్దామని ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఎప్పుడు ఏ ఎన్నిక పెడతారో తెలియక నాయకులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ముందుగా ఏ ఎన్నిక నిర్వహిస్తుందో ఎదురు చూడాల్సిందే.
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేయాలనే ఆశతో ఉన్న కొంతమంది నాయకులు నియోజకవర్గస్థాయి నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే తనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలంటూ గ్రామ, మండల స్థాయి నాయకులు ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు కానీ గ్రామాల్లో మాత్రం ఇప్పుడే రాజకీయ సందడి మొదలైంది.
గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై
జోరుగా చర్చ
అయోమయంలో నాయకులు