
కోమా నుంచి కోలుకునే దాకా..
సిద్దిపేటకమాన్: పాము కాటుకు గురై కోమాలోకి వెళ్లిన బాలికకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించి వైద్యులు ప్రాణాలు కాపాడారు. నెల రోజుల పాటు చికిత్స అందించి కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేశారు. ఈ ఘటన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత వివరాలు వెల్లడించారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన గంగరవేని శ్రీనివాస్, అంజలి దంపతుల రెండో కూతురు శ్రీజ (10) ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుంది. జులై 31న అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఆమె కుడి చేతిపై కట్లపాము కాటు వేసింది. వెంటనే పాపను బైక్‌పై సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన చిన్న పిల్లల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ సురేశ్‌బాబు, అనస్థీషియా వైద్యుడు చందర్.. పాప శరీరంలో విష ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల ద్వారా గుర్తించారు. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడం, నరాల బలహీనత, గుండె, మెదడుపై విష ప్రభావం వల్ల మాట్లాడలేకపోయినట్లు గమనించారు. పాపకు సీపీఆర్ సైతం చేశారు. 10రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి ప్రతిరోజు ప్రత్యేక వైద్య సేవలందించినట్లు తెలిపారు. పాప కాస్త కోలుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించి 30రోజుల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో పాప తల్లిదండ్రులు వైద్యాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు. సీఎస్‌ఆర్‌ఏంఓ డాక్టర్ జ్యోతి, శ్రావణి, వైద్యులు చందర్, సురేశ్‌బాబు, అనుపమ, రాగిని, రమ్య, రవి, స్నిగ్ధ, గ్రీష్మ, సాత్విక తదితరులు పాల్గొన్నారు.
బాలిక ప్రాణాలు కాపాడిన వైద్యులు
పాము కాటుకు గురై..
నెల రోజుల పాటు వైద్యం.. డిశ్చార్జి