
మురుగుకాల్వలకు నిధులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): తిమ్మాపూర్ గ్రామంలో మురికి కాల్వలకు నిధులు కేటాయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. సోమవారం గ్రామస్తులు కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో మురికి కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించామని తెలిపారు. వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంబంధిత అధికారులకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. గ్రామంలో విష జ్వరాలపై శాంపిల్స్‌ను సేకరించామని, అలాగే ఇటీవల జ్వరంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి కూడా శాంపిల్స్ సేకరించామన్నారు. శాంపిల్స్‌ను పుణేకు పంపించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కొంపాక(గజ్వేల్): సీజన్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. కొండపాక పీహెచ్‌సీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ రిజిష్టర్, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట వైద్యాధికారి శ్రీధర్, ఆయుష్ డాక్టర్ రజనీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్