
పంచాయతీ కార్యదర్శిపై విచారణ
నంగునూరు(సిద్దిపేట): పంచాయతీ కార్యదర్శిపై విచారణ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఘటన సోమవారం పాలమాకులలో కలకలం రేపింది. వివరాలు ఇలా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిత విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గ్రామస్తులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నారాయణరావ్‌పేట ఎంపీఓ శ్రీనివాసరావు పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ప్రొసిడింగ్ ఇవ్వలేదని నూనె కుమారస్వామి అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. అలాగే కార్యదర్శి గ్రామసభ నిర్వహించడం లేదని, అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన యాదండ్ల నారాయణ గత ప్రభుత్వంలో తనకు ఇల్లు మంజూరై నిర్మించుకున్నానని, ఇప్పటి వరకు బిల్లు రాలేదని అధికారులను నిలదీశాడు. ఒక్కసారిగా పెట్రోల్ బాటిల్ తీసి ఒంటిపై పోసుకుంటున్న క్రమంలో గ్రామస్తులపై పడటంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులు అతన్ని బయటకు పంపించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంటి బిల్లు రాలేదని
పెట్రోల్ పోసుకున్న గ్రామస్తుడు