
కల్తీ సవాల్..!
కేసులు పెట్టినా మారని తీరు
● ఏడాది క్రితం 2వేల లీటర్ల పాలు కల్తీ ● తాజాగా 200 కేజీల నెయ్యి.. ● అనుమతులు లేకుండా తయారీ, సరఫరా
అభం, శుభం తెలియని చిన్నారులతోపాటు ప్రజలు సైతం నిత్యం తాగే పాలు కల్తీ అవుతున్నాయి. పాలు, నెయ్యి తదితర పదార్థాలు కల్తీ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కేసులు పెడుతున్నా తీరు మారడం లేదు. తిరిగి మళ్లీ కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటే గాని ఇలాంటివి పునరావృతం కావని ప్రజలు వాపోతున్నారు. – హత్నూర( సంగారెడ్డి)
మండలంలోని గోవిందరాజు పల్లి గ్రామ శివారులోని మధుప్రియ డెయిరీ ఫామ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ దాడుల్లో 200 లీటర్ల కల్తీ నెయ్యి దొరికింది. దీంతోపాటు కాన్ ప్లోర్, టెస్టింగ్ సాల్ట్ ప్యాకెట్స్, మిల్క్ పౌడర్, మంచి నూనె ప్యాకెట్స్, కాటన్ ఇతర కెమికల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని బొమ్మ రాఘవేంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేస్తూ హైదరాబాద్ ,సంగారెడ్డి, పటాన్ చెరు ,నర్సాపూర్, జోగిపేట ఇతర పట్టణాల్లోని హోల్‌సేల్ దుకాణాలకు సరఫరా చేస్తూ లక్షలు గడిస్తున్నాడు.