
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల మృతి ● మరో ఐదుగురికి గాయాలు
జహీరాబాద్: దైవ దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... ఆదివారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలోని ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన కుటుంబం ఆల్టో కారులో దైవ దర్శనం నిమిత్తం న్యాల్‌కల్ మండలంలోని ముంగి గ్రామంలో గల ఆదిలక్ష్మి ఆలయానికి వెళుతున్నారు. మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వెంకట్(33), ఆయన అక్క కుమారుడు సాయిలు (20)లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న నాగేశ్వరరావు, వరలక్ష్మి, రుషికేష్, జాన్వీ, హరిచందనలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతులు వెంకట్, సాయిలు మామ అల్లుడు అవుతారు. లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ శివలింగం, ఎస్.ఐ వినయ్‌కుమార్‌లు సందర్శించి కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటకు తీయించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు..