
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
పటాన్‌చెరు టౌన్: అతిగా మద్యం తాగిన వ్యక్తి పడుకున్న చోటే మృతి చెందాడు. పటాన్‌చెరు పోలీసుల వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్‌కు చెందిన సునీల్ యాదవ్(41) బతుకుదెరువు కోసం వచ్చి మండలంలోని పెద్ద కంజర్ల గ్రామంలో అరబిందో నిర్మిస్తున్న నిర్మాణాల వద్ద లేబర్ క్యాంప్‌లో ఉంటూ, కూలి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం పనికి వెళ్లి తిరిగి లేబర్ క్యాంపునకు మద్యం తాగి వచ్చి పడుకున్నాడు. తిరిగి మరుసటి రోజు ఆదివారం ఉదయం సునీల్‌ను నిద్రలేపేందుకు రూమ్‌లో ఉండే ప్రమోద్ ప్రయత్నించగా మృతిచెంది ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నట్టు తోటి కార్మికులు చెప్పారు.
విద్యుదాఘాతంతో రైతు..
తొగుట(దుబ్బాక): మోటారు సరిచేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చందాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం మేరకు... గ్రామానికి చెందిన చందా నర్సయ్య (65)కు గ్రామ శివారులో కూడవెల్లి వాగు సమీపంలో ఎకరం భూమి ఉంది. వాగులోని నీటిలోకి మోటారు వేసి వరిసాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మోటారు కొంతదూరం కొట్టుకుపోయింది. ఉధృతి తగ్గడంతో మోటారు బయటకు తేలింది. దీంతో ఆదివారం వాగులోకి దిగిన నర్సయ్య మోటారును సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన రైతులు కాపాడేందుకు ప్రయత్నించగా ఆయన అప్పటికే మరణించాడు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.