
చుంచనకోటలో అడవి జంతువు సంచారం
లేగ దూడ మృతి
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని చుంచనకోట గ్రామ శివారులోని పెద్ద గుట్టల్లో గుర్తు తెలియని అడవి జంతువు సంచరిస్తుందని, పరిసర ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్టు బీట్ అధికారి రాముడు తెలిపారు. ఆదివారం గ్రామ శివారులోని పెద్ద గుట్ట ప్రాంతంలో యాట కనకయ్యకు చెందిన లేగ దూడ గుర్తు తెలియని అడవి జంతువు దాడిలో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పెద్దగుట్ట ప్రాంతంలో చిరుత లేదా పెద్ద నక్క(జుక్కల్) సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. కావున పరిసర ప్రాంతాల రైతులు, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి గ్రామాల రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా పశువులను ఇంటి వద్దనే కట్టేసుకోవాలన్నారు. అలాగే పొలం పనులకు వెళ్లే రైతులు గుంపుగా వెళ్లి, తిరిగి సాయంత్రం 6 గంటలలోపు ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు రైతులున్నారు.