ప్రభుత్వ బడుల్లో రాగిజావ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో రాగిజావ

Sep 1 2025 4:08 AM | Updated on Sep 1 2025 4:08 AM

ప్రభు

ప్రభుత్వ బడుల్లో రాగిజావ

విద్యార్థులకు పౌష్టికాహారం దిశగా అడుగులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న ప్రభుత్వం.. మరింత పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో రాగిజావను అందజేయాలని నిర్ణయించింది. అయితే రెండేళ్లుగా రాగిజావను అందజేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచి నిలిపివేయగా.. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించనుంది. ఇందులో భాగంగా నేటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ బెల్లంతో కూడుకున్న రాగిజావ అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం పోషన్‌ (మిడ్‌డే మిల్‌) పథకం కింద 2025–26 విద్యా సంవత్సరానికి రాగిజావ సరఫరాకు అనుమతి మంజూరైంది.

– నారాయణఖేడ్‌:

మ్మడి జిల్లా వ్యాప్తంగా 3,186 పాఠశాలల్లో చదువుతున్న 2.70లక్షల మంది విద్యార్థులకు రాగిజావ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇంటి నుంచి ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు బయలుదేరే చిన్నారులు తరగతి గదుల్లో అలసి పోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారంగా బెల్లంతో కూడిన రాగిజావ అందజేస్తే ప్రయోజనకరంగా ఉండడంతోపాటు విద్యార్థులు పౌష్టికాహారం అందుతుందని భావించింది. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య

జిల్లా పాఠశాలలు విద్యార్థులు

సంగారెడ్డి 1,265 1,02,000

మెదక్‌ 980 98,000

సిద్దిపేట 941 72,000

రెండున్నర నెలల తర్వాత..

ఈ ఏడాది జూన్‌ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవ్వగా.. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకం అమలు కానుంది. గతంలో మాదిరిగా సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సహకారంతో పథకాన్ని అమలు చేయనుంది. ట్రస్టు 60శాతం వ్యయం భరిస్తుండగా.. 40శాతం ప్రభుత్వం భరించి ఈ పథకాన్ని అమలు చేయనుంది. సత్యసాయి ట్రస్ట్‌ విద్యార్థులకు అవసరమైన ఫోర్టిఫైడ్‌ రాగి పొడి, బెల్లం పొడి పాకెట్లను పాఠశాలలకు సరఫరా చేస్తుంది. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కొనసాగిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు రాగిజావను తయారు చేసి విద్యార్థులకు అందించనున్నారు. ప్రతీ గ్లాసుకు ప్రభుత్వం రూ.25 పైసల చొప్పున చెల్లించనుండగా.. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపొడి, 10 గ్రాముల బెల్లం పొడి ఇవ్వాలని ఆదేశింశించారు. ఇందులో భాగంగానే వారంలో మూడు రోజులు గుడ్లు ఇవ్వని రోజుల్లో రాగిజావ, మిగతా మూడు రోజులు గుడ్డు అందించనున్నారు. అయితే ప్రారంభం నుంచి రావిజావ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆతర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కాగా, జిల్లాలోని అన్ని మండలాలకు ఇప్పటికీ రాగిజావ, బెల్లం పాకెట్లు చేరుకోలేదు. రెండు రోజుల్లో ఎమ్మార్సీలు, అక్కడి నుంచి పాఠశాలలకు వీటిని చేరవేయనున్నారు.

నేటి నుంచి పంపిణీకి శ్రీకారం

రెండున్నర నెలల తర్వాత

పథకం పునఃప్రారంభం

ఉమ్మడి జిల్లాలో

2.70లక్షల మంది విద్యార్థులకు మేలు

నేడు సంగారెడ్డి జిల్లాలోని

పోతిరెడ్డిపల్లిలో ప్రారంభం

పకడ్బందీగా అమలు చేస్తాం

పాఠశాలల్లో రాగిజావ పంపిణీ పథకాన్ని తిరిగి ప్రభుత్వం కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జెడ్పీహెచ్‌ఎస్‌ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో సోమవారం ప్రారంభిస్తాం. రాగిజావ, బెల్లం ప్యాకెట్లు సత్యసాయి ట్రస్టు నుంచి రావాల్సి ఉంది. రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు,

జిల్లా విద్యాశాఖ అధికారి, సంగారెడ్డి

ప్రభుత్వ బడుల్లో రాగిజావ1
1/1

ప్రభుత్వ బడుల్లో రాగిజావ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement