
‘పరిషత్’ సందడి!
సంగారెడ్డి జోన్: రానున్న పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని షెడ్యూల్ విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులను పరిశీలించి జాబితా రూపకల్పన చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ల ఆమోదంతో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ఎంపీడీఓలు ప్రచురించనున్నారు.
ఓటరు జాబితా ఆధారంగా
పోలింగ్ కేంద్రాల గుర్తింపు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఈనెల 6న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. జనవరి 1, 2025 ఓటరు జాబితా ప్రకారం.. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో భాగంగా 1,547 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. ప్రస్తుతం వచ్చిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై ఈనెల 8న జిల్లా, మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. 6 తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం వీటిని 9న పరిష్కరించి 10న తుది జాబితాను ప్రకటించనున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు
పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు తగిన మౌలిక వసతులు కల్పిస్తూ ఏర్పాటు చేయనున్నారు. ప్రధానగా తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు దివ్యాంగులకు ర్యాంపు సౌకర్యం కల్పించనున్నారు.
రెండు విడతల్లో ఛాన్స్!
పరిషత్ ఎన్నికల నిర్వహణ రెండు విడతల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలై చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
25 జెడ్పీటీసీ, ఎంపీపీలు..
271 ఎంపీటీసీ స్థానాలు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మండలాలు వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్, 25 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతో పాటు 271 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 లో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో 25 జెడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు పలు మండలాలు, గ్రామ పంచాయతీలతో కలిపి మున్సిపాలిటీలో విలీనంతో పాటు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. దీంతో పరిషత్ స్థానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త పరిషత్ స్థానాల జాబితా ప్రకారం.. టాప్ 5 అత్యధిక స్థానాల్లో సంగారెడ్డి జిల్లా ఉండడం విశేషం.
జిల్లాలోని ఓటర్ల వివరాలు
నియోజకవర్గం మహిళలు పురుషులు ఇతరులు
అందోల్ 84,948 82,015 6
నారాయణఖేడ్ 95,075 95,964 6
నర్సాపూర్ 21,919 20,797 2
పటాన్‌చెరు 29,261 20,797 2
సంగారెడ్డి 68,688 65,908 27
జహీరాబాద్ 95,491 95,047 2
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు
నోటిఫికేషన్
6న ముసాయిదా జాబితా విడుదల
వివిధ రాజకీయ పార్టీల
ప్రతినిధులతో సమీక్ష
10న తుది జాబితా విడుదల