
‘ఆకుకూరల’ పండుగ
జహీరాబాద్: వర్షాకాలంలో సహజంగా వచ్చే మొక్కల్లో ఆరోగ్యాన్ని అందించే పోషకాలు ఉంటాయని సందర్శకులకు పోషకాహార నిపుణులు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని దిడిగిలో గల కేవీకేలో డీడీఎస్ ఆధ్వర్యంలో సహజ ఆకుకూరల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు తదితర ప్రాంతాల నుంచి వందకు పైగా సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 40 రకాల సహజ ఆకుకూరలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం 30 రకాల ఆకుకూరలతో వండిన వంటకాలతో భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా పోషకాహార నిపుణులు సలోమి మాట్లాడుతూ.. పంట పొలాల్లో సహజంగా వచ్చే మొక్కల్లో అనేక పోషకాలు ఉంటాయన్నారు. అయితే వీటిని కలుపు మొక్కలుగా భావించి తొలగిస్తుంటారన్నారు. కానీ ఇవి కలుపు మొక్కలు కాదని, ఆకు కూరలుగా ఉపయోగించుకోవచ్చని అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే జహీరాబాద్‌లోని పస్తాపూర్, న్యాల్‌కల్‌లోని గుంజోటిలలోని జీవవైవిద్య పొలాలను సందర్శించారు. అనంతరం జహీరాబాద్‌లోని దిడిగిలో ఉన్న కేవీకేలో అనుభవ రైతులు చంద్రమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ మీలా అవగాహన కల్పించారు. అనంతరం ఆకు కూరల గొప్పతనాన్ని పాటల రూపంలో మహిళలు పాడి ఆకట్టుకున్నారు.
30 రకాల సహజ ఆకుకూరలతో
వంటకాలు
ఆరోగ్యాన్ని అందించే
పోషకాలపై అవగాహన