పశుగ్రాసం వృథాకు చెక్
హార్వెస్టర్‌తో వరి కోతలు
● అనంతరం గడ్డిని కట్టలు కట్టే బేలర్ యంత్రం
● కట్టకు రూ.30 నుంచి 35 వసూలు
దుబ్బాకటౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు సైతం యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాడు. హార్వెస్టర్‌తో కోసిన వరి పొలాల్లో గడ్డి తక్కువగా రావడంతో పాటు పొలంలో పడి వృథా అవుతుంది. దీంతో రైతులు ఆ గడ్డిని కాల్చేస్తున్నారు. డైరీ ఫామ్ నిర్వాహకులకు, పాల వ్యాపారంపై ఆధార పడుతున్న రైతులకు పశుగ్రాసం కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు బేలర్ యంత్రాలతో గడ్డిని కట్టలు కట్టి తెచ్చుకుంటున్నారు. గడ్డిని అమ్ముతూ పశుగ్రాసం కొరత తీర్చుకుంటున్నారు.
ఒక్కో కట్టకు రూ.30 నుంచి 35
వరి గడ్డి కట్టే బేలర్ యంత్రాలు ట్రాక్టర్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి. హార్వెస్టర్ కోసినప్పుడు పొలమంతా పడిన గడ్డిని బేలర్ యంత్రం కట్టలు కడుతుంది. ఎకరం పొలంలోని గడ్డిని గంటలోపే 40 నుంచి 50 కట్టలు కడుతుంది. ఒక్కో కట్టకు రూ.30 నుంచి 35 తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పెంచే రైతులు పొలంలోని గడ్డిని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముందుగా రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి యంత్రంతో కట్టలు కట్టిస్తున్నారు.
కాల్చడానికి వెనుకడుగు
గడ్డికి సైతం డబ్బులు వస్తుండటంతో రైతులు గడ్డిని కాల్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వానా కాలం సీజన్ వరి పంట కోసేంత వరకు ఎండు గడ్డి దొరకని పరిస్థితి ఇక ఉండదు. కాబట్టి పశుగ్రాసాన్ని 3, 4 నెలలు వచ్చేలా పాడి రైతులు నిల్వ చేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కావడంతో మేత లెక్కన ఒక్కో పాడి పశువు ఒక కట్ట మేస్తుంది. ఎకరానికి రూ. 2 నుంచి రూ.3 వేల వరకు గడ్డి కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో గడ్డికి డిమాండ్ ఏర్పడుతుంది.


