కార్మికులపై కేంద్రం కక్ష
కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాల్గొన్నారు.


