29న విశ్రాంత ఉద్యోగుల సమావేశం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఈనెల 29న ఉదయం 10:30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంఘం ఖేడ్ యూనిట్ అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు. సమావేశానికి సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ హాజరవుతున్నారని చెప్పారు. యూనిట్ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులంతా హాజరుకావాలని కోరారు.
అధికారులతో మాజీమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్‌లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్‌కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సభ్యులు మల్లేశం, బాలమణి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో కొబ్బరికాయలు, ప్రసాదాలు, పూజా సామగ్రి విక్రయించేందుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారి శశిధర్ పేర్కొన్నారు. ఈనెల 29న ఉదయం 10 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు చెప్పా రు. కాగా జనవరి 15, 2026 నుంచి జనవరి 14, 2027 వరకు విక్రయించేందుకు వేలం వేస్తు న్నామన్నారు. ఆసక్తి గల వారు ముందుగా రూ. 50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు.
మెదక్ కలెక్టరేట్: నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి, పాత చట్టాలనే పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
29న విశ్రాంత ఉద్యోగుల సమావేశం


