ఎస్‌టీపీ వద్దే వద్దు
● బయోడైవర్సిటీ ప్రాంతంలో ఏర్పాటు సబబేనా..?
● అమీన్‌పూర్‌వాసుల ఆందోళన
పటాన్‌చెరు: అమీన్‌పూర్ పరిధిలోని ఇసుకబావి ప్రాంతంలో కాల్వలో పారుతున్న మురుగునీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)ని సర్వే నంబర్ 993లో నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. స్థానికులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోనే గొప్ప జీవ వైవిధ్యం ఉన్న అమీన్‌పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో ఎస్‌టీపీని ఏర్పాటు చేయరాదని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి కాల్వలు, చెరువుల్లో మురుగునీరు కలవకుండా ఎస్‌టీపీలను ఏర్పాటు చేయడం మంచి ఆలోచనే కానీ.. మియాపూర్ మదీనగూడ ఆవాస ప్రాంతాల నుంచి తరలివస్తున్న మురుగును శుద్ధి చేసేందుకు ఇక్కడి స్థలాన్ని ఎంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి కొండల్లో దాదాపు 40 రకాల సీతాకోక చిలుకలు, అనేక రకాల సరీసర్పాలతో గొప్ప జీవవైవిధ్యం కనిపిస్తుంది. విదేశీ పక్షలు ఇక్కడకు వలస వస్తాయి. ెనెమళ్ల సంఖ్య ఎక్కువే. ఆ కారణంగానే ఈ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించారు. సహజ సిద్ధంగా కొండల నడుమ ఏర్పడిన పెద్ద చెరువు పరిసరాలను బయోడైవర్సిటీ సైట్‌గా జాతీయ స్థా యిలో గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎస్‌టీపీతో ఈ ప్రాంతానికి లా భం లేకపోగా.. నష్టం వాటిల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీటి ఇన్‌టెక్ సంప్‌ను ఇసుకబావిలో ఏర్పాటు చేసి అమీన్‌పూర్ పట్టణ నడి బొడ్డును రెండు కిలోమీటర్ల మేర ఆ నీటిని తోడి తెచ్చి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో శుద్ధి చేసి ఆ నీటిని మళ్లీ రెండు కిలోమీటర్ల మేర పైపుల్లో వాగులోకి తీసుకెళ్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. ఏ కారణం చేతైనా ఎప్పుడైన ఆ పైపులు పగిలిపోతే పరిస్థితి ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


