పగటి పూట కరెంట్ సరఫరా చేయండి
రాయికోడ్(అందోల్): పగటి పూట కరెంట్ సరఫరా చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికోడ్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో భయాందోళనల మధ్య పొలాలకు వెళ్లాల్సి వస్తుందని వారు వాపోయారు. అడవి పందులు, విషపురుగుల భయంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. విద్యుత్ మోటారు స్టార్టర్‌లో తరచూ పాములు, తేళ్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తమ ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, ఉదయం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగటి పూట విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు.
రాయికోడ్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన


