చెరబడుతున్నారు..!
రామచంద్రాపురం మండలంలోని ఓ చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) 43.2 ఎకరాలు. ఈ ఎఫ్‌టీఎల్‌ను 14 ఎకరాలకు తగ్గించి 29 ఎకరాలకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో ఎకరం కనీసం రూ.10 కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన ఎఫ్‌టీఎల్‌ను 14 ఎకరాలు తగ్గిస్తే ఈ చెరువుకు ఆనుకుని ఉన్న రియల్ వ్యాపారులకు రూ.కోట్లలో కలిసి వస్తుందని ఈ ఎఫ్‌టీఎల్ కుదింపు వ్యవహారానికి అధికారులు తెరలేపారు. ఈ అక్రమాల్లో నీటిపారుదలశాఖతో పాటు, రెవెన్యూ, హెచ్‌ఎండీఏలోని కొందరు అధికారులు ఈ స్కెచ్ వేశారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మొత్తం ఎనిమిది మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. సంగారెడ్డి, కంది, హత్నూర, జిన్నారం, రామచంద్రాపురం, పటాన్‌చెరు, గుమ్మడిదల, అమీన్‌పూర్ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో 496 చెరువులు ఉన్నాయి. వీటన్నింటికి ఫైనల్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ కొనసాగుతోంది. నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా క్షేత్ర పరిశీలన చేసి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. చెరువు విస్తీర్ణం అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన జియో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి ఫెనల్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తున్నారు.
రియల్ వ్యాపారులకు కలిసొచ్చేలా..
ఈ చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. చెరువులను కాపాడాల్సిన అధికారులే రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. రియల్ వ్యాపారులకు కలిసొచ్చేలా ఈ చెరువుల విస్తీర్ణం తగ్గిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రాపురం మండలంలోని ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌ను కుదించినందుకు నీటిపారుదలశాఖలోని ఓ కీలక ఉన్నతాధికారి ఏకంగా రూ.అరకోటి, మరో అధికారికి రూ.30 లక్షలకు నజరానాగా ఒప్పందం కుదిరినట్లు ఆశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు రెవెన్యూశాఖ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముడుపుల వ్యవహారంలో ఒకరిద్దరు హెచ్‌ఎండీఏ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల ఫైల్‌ను ఆపినందుకు సంబంధిత ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సైతం తెచ్చినట్లు సమాచారం.
ఎఫ్‌టీఎల్ కుదింపు వ్యవహరంలో..
ఈ చెరువు ఎఫ్‌టీఎల్ విస్తీర్ణంను కుదింపు వ్యవహారంలో హెడ్రామా కొనసాగింది. ఎఫ్‌టీఎల్‌ను 29 ఎకరాలకు కుదిస్తూ ప్రతిపాదనలు ఆశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడం గమనార్హం. ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఈ ప్రతిపాదనల ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా., ఇందులో అధికారుల జిమ్మిక్కులు వెలుగులోకి వచ్చింది. ఇలా ఇప్పటి వరకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన చెరువుల రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓ చెరువు ఎఫ్‌టీఎల్‌ను 14 ఎకరాలు తగ్గించేందుకు స్కెచ్..?
రియల్ వ్యాపారులకు రూ.కోట్లలో కలిసొచ్చేలా అధికారుల కుట్రలు
రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు
హెచ్‌ఎండీఏ చెరువుల పరిక్షణ ప్రక్రియలో జిమ్మిక్కులు


