రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి
వర్గల్(గజ్వేల్): ఎదురెదుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు . ఈ ఘటన వర్గల్ మండలం గౌరారం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా సిర్సి గ్రామానికి చెందిన సిద్ధ అమర్(26) కావేరి సీడ్స్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న ప్రిన్స్(20)తో కలిసి రోజు మాదిరిగా ఆదివారం బైక్‌పై కంపెనీ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మర్కూక్ వైపు నుంచి గౌరారం వైపు వస్తున్న స్పోర్ట్స్ బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమర్, ప్రిన్స్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన స్పోర్ట్స్ బైకిస్టు పోతూరి రజిత్‌వర్మ, వెనుక కూర్చున దాసరి దినేశ్‌కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అమర్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం ప్రిన్స్‌ని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడు అమర్ తండ్రి కంటెప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్‌ను ఢీకొట్టిన ఆటో : ముగ్గురికి గాయాలు
హవేళిఘణాపూర్(మెదక్): బైక్‌ను ఆటో ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలం పాతూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి అశోక్, భార్య లక్ష్మి, మనుమరాలు హారిక కలిసి బైక్‌పై మెదక్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్‌లు
మృతులు బీదర్ జిల్లా వాసులు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి


