49,559
రాజీవ్ యువ వికాసానికి
దరఖాస్తులు
వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం
● ఎంపీడీఓలకు బాధ్యతలుఅప్పగించిన ప్రభుత్వం ● లబ్ధిదారుల ఎంపిక కోసంజిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ● జూన్ 2న లబ్ధిదారులకుప్రొసీడింగ్స్ పంపిణీకి చర్యలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం కోసం నిరుద్యోగ యువత పెట్టుకున్న ధరఖాస్తుల క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. ఈ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించింది. నిరుద్యోగ యువత తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయూత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. మొత్తం ఆరు రకాల యూనిట్లకు ఈ పథకం కింద సబ్సిడీల రూపంలో ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 49,559 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి 22,264 దరఖాస్తులు రాగా, ఎస్సీ కార్పొరేషన్‌కు 13,735 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్‌కు 4,004, మైనార్టీ కార్పొరేషన్‌కు సంబంధించి 8,653 దరఖాస్తులు, మిగిలిన 903 దరఖాస్తులు క్రిస్టియన్, ఈబీసీ కేటగిరీల దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికి క్షుణ్ణంగా పరిశీలించి.. ఇందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉన్న వారు అర్హులుగా ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
కమిటీల్లో బ్యాంకర్లు
ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించింది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో మండల స్థాయి కమిటీ లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తుంది. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీల్లో ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. జూన్ 2న ఈ పథకం ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈలోగా ఈ ప్రక్రియలన్నింటిని పూర్తి చేసేలా అధికారులను ఆదేశించింది.
ఆరు క్యాటగిరీల్లో సబ్సిడీ సాయం
లబ్ధిదారులకు ఆరు క్యాటగిరీల్లో ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. రూ.50 వేల యూనిట్లకు వంద శాతం సబ్సిడీ ఇస్తుండగా, రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు యూనిట్లకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల యూనిట్లకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఇస్తారు. లబ్ధిదారులు మొత్తం 118 రకాల స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేందుకు వీలు కల్పించింది. చిన్న యూనిట్లు, ఇండస్ట్రీయల్ సర్వీస్ యూనిట్లు, ఆగ్రో బేస్డ్ యూనిట్లు, పశుసంవర్థకం, చిన్ననీటి పారుదల, హార్టికల్చర్, ట్రాన్స్‌పోర్టు వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది.


