
ఆయిల్‌పామ్ మొక్కలను పరిశీలిస్తున్న సువర్ణ
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్ పామ్ పంటలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి సువర్ణ అన్నారు. మంగళవారం అక్కేనపల్లిలో ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొక్కల సంరక్షణ, మెలకువలు, యాజమాన్య పద్ధతులను రైతులకు ఆమె వివరించారు. అనంతరం మాట్లాడుతూ ఎండా కాలంలో మొక్కల మధ్య జీలుగ, జనుము విత్తనాలు వేసుకోవడం ద్వారా గాలిలో తేమ శాతం పెరుగుతుందన్నారు. ఇది మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. నర్మేటలో ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయని, రెండు నెలల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్నందున ఎవరూ అధైర్యపడొద్దన్నారు.కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.