ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆఖరి రోజు అనూహ్య పరిణామాలు! | - | Sakshi
Sakshi News home page

ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆఖరి రోజు అనూహ్య పరిణామాలు!

Published Sat, Nov 11 2023 4:22 AM | Last Updated on Sat, Nov 11 2023 1:22 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల చివరి రోజు శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ పలుచోట్ల అభ్యర్థులను మార్చడం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను అధిష్టానం రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్‌కు ప్రకటించింది. దీంతో టికెట్‌ దక్కని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు.

కార్యకర్తలతో సమావేశమై స్వతంత్రంగానైనా బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీంతో అధినాయకత్వం రంగంలోకి దిగి.. షెట్కార్‌, సంజీవరెడ్డిలతో చర్చించి సయోధ్య కుదిర్చింది. షెట్కార్‌ స్థానంలో సంజీవరెడ్డికి బీ–ఫారం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో సంజీవరెడ్డి గెలుపు కోసం కలిసి పనిచేస్తామని షెట్కార్‌ వర్గం ప్రకటించింది. ఈ మేరకు ఇరువర్గాల నేతలంతా కలిసి సంజీవరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు.

పటాన్‌చెరు నియోజకవర్గం టికెట్‌ అనూహ్యంగా కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు దక్కడంతో నీలం మధు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తడిగుడ్డతో తన గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఎస్పీ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నీలం మధుకు తొలుత కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ప్రకటించిన విషయం విదితమే.

నామినేషన్‌ వేసిన ఇద్దరు!
చివరి నిమిషంలో బీజేపీ బీ–ఫారం దక్కకపోవడంతో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను బరిలో నిలుస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు బీజేపీ బీఫారం దక్కిన పులిమామిడి రాజు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారమే ఒక సెట్‌ నామినేషన్‌ వేసిన రాజు, శుక్రవారం బీజేపీ బీ–ఫారంతో మరోసెట్‌ నామినేషన్‌ వేశారు.

సంగారెడ్డి బీజేపీ టికెట్‌ బిగ్‌ ట్విస్ట్‌..
సంగారెడ్డి బీజేపీ టికెట్‌ విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ టికెట్‌ను ఆ పార్టీ నాయకుడు పులిమామిడి రాజుకు కేటాయించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర నాయకత్వం ఆయనకు గురువారం రాత్రి సమాచారం ఇచ్చింది. ఈ మేరకు నామినేషన్‌ వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. తీరా శుక్రవారం ఉదయం విడుదల చేసిన తుది జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే పేరును ప్రకటించింది.

కానీ బీ–ఫారం మాత్రం రాజుకు ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ్‌పాండే.. స్థానిక రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద విలపించారు. తనకు టికెట్‌ను ఎందుకు ప్రకటించారు..? ఎందుకు మార్చారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ప్రశ్నించారు. ఐదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తనను అవమానించారంటూ వెక్కివెక్కి ఏడ్చారు.

తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేశ్‌పాండే అనుచరులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. బీ–ఫారంతో నామినేషన్‌ వేసేందకు అటువైపు వెళుతున్న బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఇవి చదవండి: ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement