క్యాంపుల్లేవ్.. విందుల్లేవ్
ఎంజాయ్ చేస్తున్న పొరుగు పురపాలిక కౌన్సిలర్లు రిసార్టుల్లో విందులు, వినోదాలు
హుస్నాబాద్: పొరుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాల్లో ఎంజాయ్ చేస్తుంటే, హుస్నాబాద్‌లో గెలిచిన కౌన్సిలర్లు మాత్రం ఇంటి వద్దే శివరాత్రి జాగరణ చేస్తున్నారు. మున్సిపల్ క్యాంపు రాజకీయాలు రంజుగా కొనసాగుతున్నాయి.సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపల్ క్యాంపు రాజకీయాలు విహార యాత్రలు, రిసార్టులకు వేదికగా మారాయి.
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కాంగ్రెస్‌కే జై కొట్టారు. మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 16 స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకోగా, 4 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఫలితాల ప్రకటన ముగియగానే క్యాంపు రాజకీయాలు ఉంటాయని, ఇతర ప్రాంతాల్లో సేద తీరవచ్చని గెలిచిన పలు పార్టీల కౌన్సిలర్లు ఊహల్లో తేలియాడారు. తీరా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు రావడం, బీఆర్‌ఎస్‌కు కేవలం 4 స్థానాలకే పరిమితం కావడంతో క్యాంపు రాజకీయాలకు అవకాశం లేకుండాపోయింది.
గతంలో రెండు పర్యాయాలు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు అనివార్యమయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు పలు పార్టీలు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లోని రిసార్టులలో విందు, వినోదాల్లో మునిగిపోయారు. కాగా ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించడం, 16న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, వెంటనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండటంతో క్యాంపు రాజకీయాలకు పార్టీలు అంతగా ఆసక్తి చూపలేదు. మ్యాజిక్ ఫిగర్‌కు 2 లేదా మూడు సీట్ల తేడా ఉంటే క్యాంపు రాజకీయాలకు అవకాశం ఉండేది. కాంగ్రెస్ అధిష్టానం 16 మంది కౌన్సిలర్లను క్యాంపుల పేరిట విహార యాత్రకు తీసుకెళ్తారని అందరూ ఊహించారు. ప్రమాణ స్వీకారానికి మధ్య రెండు రోజుల గడువులో ఒక రోజు ఆదివారం శివరాత్రి. చాలా మంది కౌన్సిలర్లు శివాలయాల్లో పూజలు చేయడం, ఉపవాసాలు ఉంటారని క్యాంపులకు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించినట్లుంది. మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ వారి కౌన్సిలర్లను క్యాంపులకు తరలించడం వృఽథా ప్రయాస అని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు వివిధ క్యాంపుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్లు మాత్రం ఇంటి పట్టునే జాగరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
శివరాత్రి జాగరణలో హుస్నాబాద్‌లో గెలిచిన కౌన్సిలర్లు


