విఠలాపూర్‌లో పెద్దపులి కలకలం
● ఫారెస్టు అధికారుల గాలింపు ● భయాందోళనలో ప్రజలు
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం విఠలాపూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా చౌడారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి, తాజాగా విఠలాపూర్ శివారులోకి ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు ధృవీకరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన చింతకింది దేవయ్య, కొమ్మురాజుల యాదగిరి, దాసరి రాజు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య సిబ్బందితో అక్కడకు చేరుకొని పరిశీలించి, పులి సంచరిస్తుందని నిర్ధారించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ చంద్రమోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు రాత్రి సమయంలో వెళ్లవద్దని సూచించారు. పశువులను కాపాడుకోవాలని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విఠలాపూర్‌లో పెద్దపులి కలకలం


