తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు | Padayatras in Telangana: YS Sharmila, RS Praveen Kumar, Bhatti Vikramarka, Bandi Sanjay | Sakshi
Sakshi News home page

తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు

Mar 11 2022 4:29 PM | Updated on Mar 11 2022 4:38 PM

Padayatras in Telangana: YS Sharmila, RS Praveen Kumar, Bhatti Vikramarka, Bandi Sanjay - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో పాదయాత్రలు జోరందుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ముందస్తు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయ పార్టీల నాయకుల పాదయాత్రలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రారంభించి విరామం ప్రకటించిన పాదయాత్రలు పునఃప్రారంభం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు తద్వారా ఓటర్ల మన్ననలు పొందేందుకు పాదయాత్రలు దోహదం చేస్తాయని నాయకులు విశ్వసిస్తున్నారు. 

300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర
మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేరికతో తెలంగాణలో బహుజన సమాజ్‌ పార్టీలో ఉత్సాహం కనబడుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ప్రవీణ్‌కుమార్‌ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బీఎస్‌పీ తెలంగాణ చీఫ్‌ కోఆర్డినేటర్‌ హోదాలో ఆయన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు.  జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ నుంచి మార్చి 6న ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 300 రోజుల పాటు 5 వేల గ్రామాల గుండా ఈ యాత్ర సాగనుంది. 

ప్రజాప్రస్థానం పున:ప్రారంభం
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను మార్చి 11 నుంచి పునః ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి పాదయాత్ర పున:ప్రారంభమైంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో కొనసాగేలా పాదయాత్రకు రూపకల్పన చేశారు. గతేడాది అక్టోబర్‌ 20న ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించిన షర్మిల... ఎమ్మెల్సీ కోడ్‌తోపాటు కరోనా మూడో వేవ్‌ కారణంగా పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.

భట్టి విక్రమార్క.. పీపుల్స్‌ మార్చ్‌
కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గంలో ‘పీపుల్స్‌ మార్చ్‌’ పేరుతో ఫిబ్రవరి 27న పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి నుంచి పాదయాత్ర చేపట్టి 100 కిలోమీటర్లు పూర్తి చేశారు. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో 32 రోజుల పాటు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ.. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పాదయాత్రను పునఃప్రారంభించే అవకాశముంది. 

ఏప్రిల్‌ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14 నుంచి రెండో విడత యాత్ర చేపట్టనున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు, ఇతర అంశాలు తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దాలని ఆయన భావిస్తున్నారు. (క్లిక్‌: ‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్‌, భారతరత్న’)

ఆమ్‌ ఆద్మీ పార్టీ పాదయాత్ర
ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న మరికొంత నేతలు కూడా పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సెర్చ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఇందిరా శోభన్‌ గతంలో తెలిపారు. అయితే పంజాబ్‌లో  ‘ఆప్‌’ ఘన విజయం ఆ పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహం నింపింది. (క్లిక్‌: సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?)

ముందస్తు ఎన్నికలకు వెళ్లం
కాగా, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని సీఎం కేసీఆర్‌ ఇటీవల తేల్చిచెప్పారు. 103 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. సోషల్‌మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement