Sanjay Raut: ‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్‌, భారతరత్న’

Padma Vibhushan, Bharat Ratna For Mayawati, Asaduddin Owaisi: Sanjay Raut - Sakshi

శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో శివసేన సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీలకు పద్మవిభూషణ్‌ లేదా భారతరత్న పురస్కారాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం. అఖిలేశ్‌ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయి. 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌ చేశారు. 

పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయారు?
నాలుగు రాష్ట్రాలలో బీజేపీ గెలిచినప్పటికీ.. పంజాబ్‌ ఓటర్లు కమలం పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా సీనియర్‌ నేతలంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పంజాబ్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే.. పంజాబ్‌లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని వెల్లడించారు. బీజేపీ వంటి జాతీయ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఆలోచించదగ్గ విషయని అన్నారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. 

బీజేపీకి బీ టీమ్‌..
యూపీ ఎన్నికల్లో బీజేపీకి బీఎస్‌పీ, ఎంఐఎం బీ టీమ్‌ పనిచేశాయని ప్రత్యర్థి పార్టీలు బలంగా ఆరోపించాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఈ రెండు పార్టీలు పనిచేశాయని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఎస్‌పీ, ఎంఐఎం పార్టీలు తోసిపుచ్చాయి. తాము బీజేపీకి బీ టీమ్‌ అని తప్పుడు ప్రచారం చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి వాపోయారు. బీజేపీని ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని ఎ‍న్నికల ఫలితాల అనంతరం ఆమె అన్నారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ఉత్తరప్రదేశ్‌లోని మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. (చదవండి: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్‌ బూస్ట్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top