
బడుల్లో ‘షుగర్ బోర్డ్’ల ఏర్పాటుకు సీబీఎస్‌ఈ ఆదేశం
అవసరానికి మించి చక్కెర తీసుకుంటున్న విద్యార్థులు
అవగాహనతోనే వాడకానికి కళ్లెం
ఆరోగ్యంపై ఇప్పటికే కొన్ని బడుల్లో తరగతులు
పోషకాహారం, పరిశుభ్రతపై పాఠాలు
ఇటీవలి కాలంలో జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, మితిమీరిన స్మార్ట్‌ఫోన్ల వాడకం.. ఇవన్నీ బాల్యాన్ని అనారోగ్యపు కోరల్లోకి నెట్టేస్తున్నాయి. బడి పిల్లల్లో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొన్ని బడుల్లో మ్యాథ్స్, సైన్స్‌తోపాటు ఆరోగ్యంపైనా తరగతులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కూడా విద్యార్థులు మధుమేహం బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి పరిష్కారంగా.. తన పరిధిలోని అన్ని బడుల్లో ‘షుగర్ బోర్డులు’ఏర్పాటుచేయాలని ఆదేశించింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (2019–21) ప్రకారం... 5 ఏళ్లలోపు పిల్లల్లో 3.4 శాతం మందిలో ఊబకాయం సమస్య ఉంది. 23 శాతం పురుషులు, 24 శాతం మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ‘ద లాన్సెట్’లో వచి్చన గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్ కొలాబరేషన్స్ విశ్లేషణ ప్రకారం.. 1990లో 0.46 కోట్ల మంది అబ్బాయిల్లో ఊబకాయం ఉంటే, 2021 నాటికి ఆ సంఖ్య 1.3 కోట్లకు పెరిగింది.
ఇదే సమయంలో అమ్మాయిల్లో 0.45 కోట్ల నుంచి 1.24 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఇలాంటి అమ్మాయిల సంఖ్య 1.44 కోట్లకు, అబ్బాయిల సంఖ్య 1.6 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. భారత జాతీయ సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లు ఉండగా.. ఇది జపాన్‌లో 84 ఏళ్లుగా ఉంది. ఆరోగ్య జీవన ప్రమాణం (ఎలాంటి రోగాలు లేకుండా జీవించడం) పరంగా చూసినప్పుడు ఈ తారతమ్యం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్‌లో ఎలాంటి రోగాల బారిన పడకుండా 70 ఏళ్ల వరకూ సంతోషంగా జీవిస్తుంటే.. ఇది మన దేశంలో 60 సంవత్సరాలు మాత్రమే!
సమగ్ర ఆరోగ్య పాఠ్యప్రణాళిక
పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నివారించేందుకు చిన్నప్పటి నుంచే పిల్లల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కొన్ని పాఠశాలలు ‘సమగ్ర ఆరోగ్య పాఠ్యప్రణాళిక’ను అమలు చేస్తున్నాయి. ప్రతివారం ప్రత్యేకంగా ఆరోగ్య విద్యపై తరగతులు నిర్వహిస్తూ, ఆరోగ్యంపై శ్రద్ధ కల్పిస్తున్నాయి. ప్రధానంగా పోషకాహారం, పరిశుభ్రత, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, ప్రథమ చికిత్స తదితర అంశాలపై పాఠాలు చెబుతున్నారు. బాల్యం నుంచే ఆరోగ్యంపై అవగాహన ఉన్న విద్యార్థులు మంచి అలవాట్లను పెంచుకుంటారని, వీరు తమ తదనంతర జీవితంలో రోగాల బారిన పడకుండా సంతోషకరమైన జీవనాన్ని గడుపుతారని నిపుణులు చెబుతున్నారు.
సెమినార్లు, వర్క్ షాపులు
పాఠశాలల్లో షుగర్ బోర్డులను ప్రదర్శించడంతోపాటు.. చక్కెరతో వచ్చే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు, వర్క్‌షాపులు కూడా నిర్వహించాలని సీబీఎస్‌ఈ పేర్కొంది. దీనికి సంబంధించి తీసుకున్న చర్యలపై సంక్షిప్త నివేదికను జూలై 15వ తేదీ నాటికల్లా సమరి్పంచాలని ఆదేశించింది. ఈ చర్యలు విద్యార్థుల దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని సీబీఎస్‌ఈ భావిస్తోంది.
‘5–4–3–2–1–0’మంత్రం
పలు స్కూళ్లలో ఉదయమే వందేమాతరం, జనగణమనతో పాటు ‘‘5–4–3–2–1–0’’అంటూ.. ఆరోగ్య మంత్రాన్ని విద్యార్థులు జపిస్తున్నారు. ‘5’అంటే రోజూ ఐదురకాల పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవడం. ‘4’అంటే ప్రతి రోజూ నాలుగుసార్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ‘3’అంటే మూడుసార్లు ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం. ‘2’అంటే స్క్రీన్ టైమ్‌ను (టీవీ, ఫోన్, ల్యాప్‌ట్యాప్ చూడటం) రెండు గంటలకు పరిమితం చేయడం. ‘1’అంటే రోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయడం!
ఈటింగ్ షుగర్ నో పప్పా
ఇటీవలి కాలంలో పిల్లల్లో మధుమేహం కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా గతంలో పెద్దల్లో మాత్రమే కనిపించే టైప్ 2 మధుమేహం.. ఇటీవల పిల్లల్లోనూ కనిపిస్తుండటంతో సీబీఎస్‌ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో ప్రత్యేక షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. తద్వారా అతిగా చక్కెర తినడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించింది. ఇలా ప్రత్యేక షుగర్ బోర్డుల ఏర్పాటు ద్వారా విద్యార్థులు ఏమేర చక్కెరను తింటున్నారో పర్యవేక్షించేందుకు, వారి చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు వీలవుతుందని సీబీఎస్‌ఈ భావిస్తోంది. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) సలహా మే రకు సీబీఎస్‌ఈ ఈ కార్యక్రమం చేపట్టింది.
చక్కెరతో అనర్థాలు
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో మధుమేహంతోపాటు ఊబకాయం, దంత సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఇవన్నీ విద్యార్థులను చదువుల్లో వెనుకబడేలా చే సే ప్రమాదం ఉందని తెలిపింది. బడుల్లో ఏర్పాటు చేసే షుగర్ బోర్డుల్లో.. ప్రతి రోజు పిల్లలు ఎంత మేరకు చక్కెర తీసుకోవాలి.. ఆయా ఆహార పదార్థాల్లో ముఖ్యంగా జంక్çఫుడ్స్, సాఫ్ట్‌డ్రింక్స్‌లో ఎంతమేర చక్కెర ఉంటుంది.. అతిగా పంచదార తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు.. తదితర విషయాలను వివరిస్తారు. దీంతోపాటు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను కూడా తెలియజేస్తారు.
3 రెట్లు ఎక్కువగా!
‘ప్రస్తుతం 4–10 ఏళ్ల వయసున్న విద్యార్థులు ప్రతిరోజూ చక్కెర నుంచి సగటున 13 శాతం కేలరీలు పొందుతున్నారు. అలాగే 11–15 ఏళ్ల వయసు విద్యార్థులకు చక్కెర నుంచి 15 శాతం కేలరీలు లభిస్తున్నాయి. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం వాస్తవానికి ఇది 5 శాతానికి మించి ఉండకూడదు. అంటే నిర్దేశిత పరిమాణం కంటే మూడురెట్లు ఎక్కువగా స్కూల్ విద్యార్థులు షుగర్‌ను తీసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి’అని సీబీఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది.