TG: ‘హిల్ట్‌ పి’కి ఆమోదం | Political Heat Rising Over Hilt P In Telangana | Sakshi
Sakshi News home page

TG: ‘హిల్ట్‌ పి’కి ఆమోదం

Nov 24 2025 1:42 AM | Updated on Nov 24 2025 1:44 AM

Political Heat Rising Over Hilt P In Telangana

22 పారిశ్రామికవాడల్లోని 4,740 ఎకరాల వినియోగ మార్పిడికి చాన్స్‌

ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ 

రోడ్ల వెడల్పు మేరకు ఎస్‌ఆర్‌ఓ రేటులో 30 శాతం, 50 శాతం చెల్లించేలా ప్లాట్ల ధరల నిర్ధారణ 

చెల్లింపులన్నీ సింగిల్‌ విండో విధానంలోనే..  నోడల్‌ ఏజెన్సీగా టీజీఐఐసీ..

హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీల సమన్వయం 

‘హిల్ట్‌ పి’పై రాజకీయంగా పెరుగుతున్న వేడి  

దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ అంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపణలు 

లీజుదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన 3 జీవోల మాటేమిటంటున్న అధికార కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ‘హిల్ట్‌ పి’ రాజకీయంగా హీట్‌ పెంచుతున్నా.. ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్‌ రింగురోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో వినియోగంలో లేని, నిరుపయోగంగా ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం–2025 (హిల్ట్‌ పి)లో భాగంగా పారిశ్రామిక వాడల్లోని భూములను బహుళ వినియోగ జోన్ల కిందకు మారుస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ జీఓ 27 జారీ చేశారు.

దీంతో ఈ పారిశ్రామిక వాడల్లో వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు అంటే..రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్‌స్టిట్యూషన్‌ తదితర కేటగిరీల కింద ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఇది రూ.5 లక్షల కోట్ల స్కామ్‌ అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూముల అభివృద్ధి పేరిట సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

టీజీఐఐసీ ధరల కంటే సబ్‌ రిజి్రస్టార్‌ ఆఫీస్‌ (ఎస్‌ఆర్‌ఓ) రేట్లు తక్కువగా ఉంటాయంటూ, ఆ ఎస్‌ఆర్‌ఓ రేటు కంటే తక్కువ విలువకే భూ మారి్పడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఓ విలువ కంటే 100, 200 శాతం అదనంగా వసూలు చేసిందంటూ, ఆ మేరకు ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఆరోపణలను పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్‌బాబు ఎప్పటికప్పుడు దీటుగా తిప్పికొడుతున్నారు.

గతంలో ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట.. మూడు పారిశ్రామిక వాడల్లోని భూములపై లీజుదారులకు పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌ రైట్స్‌) ఇచ్చేందుకు 2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడు వేర్వేరు జీవోలు ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ విధంగా ‘హిల్ట్‌ పి’ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సమయంలోనే..ఆ పాలసీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం గమనార్హం. 

అందుబాటులో 4,740.14 ఎకాల భూమి
ప్రస్తుతం ఔటర్‌ రింగురోడ్డు పరిధిలో, దానికి సమీపంలో దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వీటికి అప్పట్లో 9,292.53 ఎకరాల భూమి కేటాయించగా.. ప్రస్తుతం అందులో 4,740.14 ఎకాల భూమి వినియోగానికి అందుబాటులో ఉంది. ఈ పారిశ్రామికవాడలన్నీ ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు కాగా.. ఇప్పుడు జనసాంద్రత పెరగడంతో కీలక నగరంలో భాగమయ్యాయి.

దీంతో వివిధ కారణాలతో కొంతకాలంగా పలు పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ భూములను బహుళ వినియోగ (మల్టీ యూజ్‌) జోన్లుగా మార్చి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు పారిశ్రామిక వాడల వారీగా కేటాయించిన భూ విస్తీర్ణం, ప్రస్తుతం మారి్పడికి అనువైన భూ విస్తీర్ణం, వాటికి టీజీఐఐసీ విలువను చదరపు గజాల్లో వెల్లడించగా.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు (ఎస్‌ఆర్‌ఓ) విలువను చదరపు మీటర్లలో వెల్లడిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. 

హిల్ట్‌ పి అమలవుతుందిలా...! 
హిల్ట్‌ పి–2025 ప్రకారం ఈ పారిశ్రామిక వాడల్లోని వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. రెసిడెన్షియల్‌ కేటగిరీలో అపార్ట్‌మెంట్‌లు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌íÙప్‌లు.. వాణిజ్య కేటగిరీలో ఆఫీసులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, హోటళ్లు.. ఇన్‌స్టిట్యూషన్‌ కేటగిరీలో పాఠశాలలు, ఆసుపత్రులు, రీసెర్చ్‌ సెంటర్లు..రెక్రియేషనల్‌ కేటగిరీలో పార్కులు, క్రీడా వేదికలు.. ఐటీ/ఐటీఈఎస్‌ పార్కుల కేటగిరీలో గ్రిడ్‌ పాలసీకి అనుగుణంగా టెక్‌ క్యాంపస్‌లకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ భూ వినియోగ మార్పు ప్రక్రియను హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీ విభాగాలు సమన్వయం చేస్తాయి. ఈ పాలసీ అమలుకు నోడల్‌ ఏజెన్సీగా తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) వ్యవహరిస్తుంది. 

ధరలు ఇలా.. 
ఈ భూమి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ధరను నిర్దేశించింది. 80 అడుగుల కంటే తక్కువ రోడ్లు ఉన్న ప్లాట్లకు ఎస్‌ఆర్‌ఓ రేటులో 30 శాతం, 80 అడుగుల కంటే పెద్ద రోడ్లు ఉంటే 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే భూ వినియోగ చార్జీలు (సీఎల్‌యూ) ఉంటాయి. ఈ చెల్లింపులన్నీ సింగిల్‌ విండో విధానంలో ఉంటాయి. టీజీఐపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియ అంతా టీజీఐపాస్‌ పోర్టల్‌ ద్వారానే సాగుతుంది. దరఖాస్తు సమయంలో 20 శాతం ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు అందిన వారం రోజుల్లో టీజీఐఐసీ/ఐలా ప్రాథమిక పరిశీలన పూర్తి చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ వారం రోజుల్లో అనుమతులు జారీ చేస్తుంది. తదుపరి వారం రోజుల్లో డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత 45 రోజుల గడువులో మిగిలిన 80 శాతం రుసుమును రెండు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చెల్లింపుల్లో విఫలమైతే నెలరోజుల్లో ప్రతి స్టేజిలో ఒక శాతం చొప్పున పెనాల్టీ విధిస్తారు.

నిర్దిష్ట గడువులోగా చెల్లింపులు చేయడంలో విఫలమైతే దరఖాస్తుదారుడు ఏ విధంగానూ రీఫండ్‌కు అర్హత సాధించరు. హిల్ట్‌ పి విధానంతో ప్రభుత్వానికి భారీగా పన్నేతర ఆదాయం సమకూరనుంది. హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీలకు చార్జీల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో 25 శాతం టీజీఐఐసీ ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వులకు హిల్ట్‌ పి అమలు మార్గదర్శకాలను రూపొందించాలని టీజీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement