ఒకప్పుడు పెళ్లిళ్ల సంబరాలంటే ఎలా ఉండేవో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటిల్లిపాదికీ నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఉండేది..పెళ్లి పందిరి వేయడం దగ్గర నుంచి ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టడం.. బంధువులను పిలవడం, పసుపు కొట్టడం, మామిడి తోరణాలు కట్టడం, ఇంటిని పూలతో అలంకరించడం ఇలా ఇంటిల్లిపాది నెలరోజుల పాటు వేడుకల్లో ఉండేవి.. కానీ ఇప్పటి 5జీ యుగంలో కాలం మారడంతో వేడుకల తీరు మారింది...
తమ కూతురు పెళ్లి విదేశాల్లో జరుగుతుండడంతో అక్కడికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారా వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన దంపతులు జయరాజు, జ్యోతి తమ ఒక్కగానొక్క కుమార్తె హిమబిందు వివాహాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించారు. వారి కుమార్తె హిమబిందు అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే ఆమెకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అమెరికాలో నివసిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
హిమబిందు తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి తమ కుమార్తె పెళ్లికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. దీంతో వారు ఆన్‌లైన్ ద్వారా వివాహ వేడుకను వీక్షించారు. పెళ్లిలో సంప్రదాయ ఆచారం నిర్వహించే సమయం రాగానే.. జయరాజు, జ్యోతి చేతుల్లో అక్షింతలు తీసుకున్నారు. స్క్రీన్‌పై కనిపిస్తున్న తమ కుమార్తె హిమబిందు, అల్లుడు రోహిత్ కుమార్‌పై అక్షింతలను చల్లి ఆశీర్వదించారు. వారి కుమార్తె, అల్లుడు వివాహ ప్రమాణాలు చేసుకుంటున్న సమయంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ ఆశీర్వాదాలను అందించారు.
హిమబిందుకు, తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పెళ్లికి హాజరు కాలేకపోయినా.. వీడియో కాల్ తో జయరాజు, జ్యోతిలకు కూడా తమ కుమార్తె పెళ్లిలో తల్లిదండ్రులుగా చేయాల్సిన సంప్రదాయాన్ని పూర్తిగా మిస్ కాకుండా నిర్వహించే అవకాశం లభించింది.
దూరం కారణంగా కుటుంబ సభ్యులు ఒకరికొకరు ముఖ్యమైన సందర్భాల్లో ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితుల్లో సాంకేతికత ఎలా వారిని దగ్గర చేస్తోందో ఈ వివాహం నిదర్శనంగా నిలిచింది. అయితే వీడియో కాల్ లేదా లైవ్‌స్ట్రీమ్ ప్రత్యక్షంగా అక్కడ ఉండటాన్ని పూర్తిగా భర్తీ చేసిందనడం అతిశయోక్తే అవుతుంది.


