
దుకాణాలకు బదులు ఆన్ లైన్ లో కొనుగోళ్లు
ఆఫ్‌లైన్‌తో పోలిస్తే సౌకర్యాలున్నాయన్న భావన
తమ గురించి నలుగురికీ తెలియకూడదనే ఆలోచన
ఇది మరీ ఎక్కువైతే మానసిక రుగ్మతలు, ఒంటరితనం
ఆన్ లైన్ షాపింగ్ మన జీవితాల్లో భాగమైపోయింది. కొంతమందికి ఇది గేమ్–ఛేంజర్. కిరాణా సామగ్రి, దుస్తులు, ఆహారం, బహుమతులు, ఫర్నిచర్, ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. వీటిని కొనేవారి సంఖ్య నేడు కోట్లలో ఉంది. ఆన్ లైన్ షాపింగ్ అంటే సౌకర్యం, ఎంచుకోవడానికి లక్షలాది ఉత్పత్తులే కాదు.. కొందరికి వ్యక్తిగత గోప్యత కూడా. ఆన్ లైన్ అయితే మనం ఉన్నచోటు నుంచే 24 గంటల్లో ఎప్పుడైనా షాపింగ్ చేయవచ్చు. మరొకరి అభీష్టాలతో కాకుండా సొంత నిర్ణయంతో తమకు నచ్చినవి చేజిక్కించుకోవచ్చు. జనం మధ్యలో కొనాల్సి వస్తోందన్న ఒత్తిడి లేదు. ట్రాఫిక్, ప్రయాణం వంటి అడ్డంకులూ లేవు.
కొంత మంది జనంలో కలవడానికి ఇష్టపడరు. మరి కొందరు అధికంగా అవసరానికి మించి కొనుగోలు చేస్తారు. ఖర్చు ఎక్కువగా పెడితే షాపులోని వాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటున్నారో అని పదేపదే ఆలోచించి ఒత్తిడికి గురి అవుతారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ షాపింగ్ గొప్ప ఉపశమనం. వీరు తమ గురించి ఇతరులు అంచనా వేయకూడదని అనుకోవడం, సామాజిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటి లోతైన మానసిక భావాలను కలిగి ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు.
కొంతమందికి బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆన్ లైన్ షాపింగ్‌ను ఇష్టపడే వ్యక్తులు సౌలభ్యం, సమయం, ఆచితూచి ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది అంతర్ముఖులు ఉంటారు. వీరు ఏకాంతంగా ఆన్ లైన్ లో షాపింగ్ ఇష్టపడతారు.
ఇలాంటివి నచ్చక..
ఆన్ లైన్ షాపింగ్‌లో ఏం కొనాలనేది మన నియంత్రణలో ఉంటుంది. ఏం కొన్నామో మరొకరికి తెలియదు. సురక్షితం అన్న భావన ఉంటుంది. నెమ్మదిగా, కావాల్సినంత సమయం షాపింగ్ చేయవచ్చు. 24 బై 7.. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా కొనుక్కోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచనే రాదు. మనకు ఇష్టమైన వెరైటీలు చూడొచ్చు, ధరలను పోల్చవచ్చు, కావలసినదాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఈ సౌలభ్యాలేవీ ఆఫ్‌లైన్ లో ఉండవు. మన రూపం, ఎంపికలు, బడ్జెట్ ఆధారంగా దుకాణదారులు కస్టమర్లను అంచనా వేస్తారు. ఏం కొనాలనేది కస్టమర్ల అభీష్టం. అలాంటిది ‘మీకు ఈ డ్రెస్ బాగుంటుంది’, ‘తక్కువ రేటే’ అంటూ షాప్‌వాళ్లు చేసే సూచనలు / సలహాలు చాలామందికి నచ్చవు. ఇవి కూడా ఆన్ లైన్ లో ఉండవు. దేనికి, ఎంతకు షాపింగ్ చేస్తున్నారో ఇతరులెవరూ కనుక్కోలేరు. అందువల్ల ఒకరి షాపింగ్ తీరుపై మరొకరు కామెంట్ చేసే అవకాశమూ ఉండదు.
అపరాధ భావన ఉండొద్దని..
ఆన్ లైన్ లో షాపింగ్ చేసినప్పుడు డబ్బు ఖర్చులోనూ ఇబ్బందులు ఉండవు. సంప్రదాయ నగదు మార్పిడి ఉండదు. చెక్‌అవుట్ వద్ద ఇబ్బందికరమైన స్వైప్ ఉండదు. ఖర్చు చేశామన్న అపరాధ భావన ఉండకూడదని ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారూ లేకపోలేదు. ఇతరులు వారి అభిప్రాయాలను రుద్దకుండా, జన సమూహం లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ పూర్తి చేయవచ్చు. అయితే అవసరం లేకపోయినా కొంత మంది.. ఏమీ తోచక లేదా వెబ్‌సైట్‌లో ఏదో డిస్కౌంట్ సేల్ అని ప్రకటించగానే కొనుగోళ్లు చేస్తున్నారట.
కొనేసిన తరవాత.. అవసరానికి మించి కొన్నామన్న అపరాధ భావన వీరిలో ఉంటోందట. క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసేవారిలో ఇది ఎక్కువగా ఉంటోందట. ఆన్‌లైన్ షాపింగ్ చేసే.. అంతర్ముఖ స్వభావం ఉండే వ్యక్తుల్లో మరో ప్రత్యేకత కూడా ఉంటుందట. ఒక ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు అది ఏదో సందర్భంలో నచ్చకపోతే.. దానిమీద కోపంతో మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లిపోతారు. అంతేకాదు, ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరేది / క్వాలిటీ లేని వస్తువు వచ్చినా.. రిటర్న్ పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురైనా కూడా వీరు వేరే వేదికను ఎంచుకుంటారట. తాము బహిష్కరించినట్టు భావించే మొదటి ప్లాట్‌ఫామ్‌ను కొన్నాళ్లు వదిలేస్తారు.
ఈ సమస్యలూ ఉన్నాయి
బయటకు వెళ్లి, ట్రాఫిక్‌లో విసుక్కుంటూ ప్రయాణించి, దుకాణాల్లో షాపింగ్ చేయడానికి కొన్ని గంటలు సమయం పడుతుంది. దీనివల్ల కొందరిలో అలసిపోయిన భావన ఉంటుంది. అదే పనిని కొన్ని క్లిక్‌లతో సాధ్యం చేసే మరింత అనుకూల అవకాశం ఉన్నప్పుడు అటువైపు మొగ్గు చూపేవారూ ఉంటారు. కానీ అధిక ఆన్ లైన్ షాపింగ్ కొన్నిసార్లు సామాజిక ఆందోళన లేదా అనవసరపు ఖర్చులకు దారితీయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్‌కి పరిమితమవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. జనానికి దూరం అవుతారు. నిశ్శబ్దంగా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు ఆన్ లైన్ షాపింగ్ తలుపులు తెరిచే అవకాశమూ లేకపోలేదు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
⇒ ఆన్ లైన్ షాపింగ్ శత్రువు కాదు. ఇది మారుతున్న జీవితాలు, అలవాట్లు, ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తుంది. కొంతమందికి ఇది సహాయకారి. సమయం ఆదా చేయడం, నచ్చినన్ని వెరైటీలు చూసుకునే వెసులుబాటు.. ఇలాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. అదే సమయంలో జీవితం మరింత డిజిటల్‌గా మారుతున్న కొద్దీ వాస్తవ ప్రపంచ అనుబంధాల విలువను, ఉనికిని మర్చిపోకూడదు. మనల్ని మనమే ఒంటరిని చేసుకోకూడదు అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
⇒ సమస్యల నుంచి తప్పించుకోవడానికి..: తక్కువ ఆత్మస్థైర్యం లేదా ఆత్మన్యూనత లేదా అంతర్ముఖత్వం కారణంగా దుకాణాలకు వెళ్లకుండా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవాళ్లు కూడా ఉంటారు. ఆ భావనను కప్పిపుచ్చుకునేందుకు లేదా అధిగమించే ప్రయత్నంలో.. తెలిసి కొందరు, తెలియక కొందరు అనవసరపు ఖర్చులు చేస్తుంటారని మానసిక వైద్యులు అంటున్నారు.