మన్నే మాణిక్యం! | Two kilos of soil with a Rs 68 lakh return: The Maharashtra village that struck biodiversity gold | Sakshi
Sakshi News home page

మన్నే మాణిక్యం!

Mar 22 2026 4:27 AM | Updated on Mar 22 2026 4:28 AM

Two kilos of soil with a Rs 68 lakh return: The Maharashtra village that struck biodiversity gold

దాపూర్‌ మట్టి.. చాలా రిచ్‌!

2 కిలోల మట్టికి రూ. 68 లక్షలు చెల్లించిన కంపెనీ 

మట్టిలోని సూక్ష్మజీవితో 42 రకాల ప్రోబయోటిక్‌ ఉత్పత్తుల తయారీ 

మహారాష్ట్రలోని ఆ పంచాయతీకి లాభాల్లో వాటా పంపిణీ చేసిన కంపెనీ 

జీవవైవిధ్య ఒడంబడిక ప్రకారం చెల్లింపులు

(సాక్షి స్పెషల్‌ డెస్క్): వెండి కన్నా ఎక్కువ విలువైనది ఆ మన్ను.. అవును.. మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలోని ఒక కుగ్రామం 2 కిలోల మట్టిని రూ. 68 లక్షలకు ఒక బయోటెక్నాలజీ కంపెనీకి అమ్మింది. ఆ మట్టిలో ఏముందో అనే కదా మీ సందేహం? ఆ మట్టిలో ఉన్న ఒక సూక్ష్మజీవి అనేక ప్రోబయోటిక్‌ ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. భారతీయ జీవవైవిధ్య చట్టాల ప్రకారం.. స్థానిక జీవ వనరులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకునే కంపెనీలు తమ లాభాల్లో వాటా­ను స్థానిక పంచాయతీలకు పంచాలి. ఆవిధంగా దాపూర్‌ అనే గ్రామం నుంచి స్వీకరించిన రెండు కిలోల మట్టిలోని సూక్ష్మజీవులను ఉపయోగించుకున్నందుకుగాను సదరు కంపెనీ ఆ గ్రామ పంచాయతీకి రూ. 68 లక్షలను చెల్లించింది.  

‘సూక్ష్మ’ంలో ధనం
దాపూర్‌ గ్రామం నాసిక్‌కు 50 కిలోమీట­ర్ల దూరంలో ఉంటుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల కోసం అన్వేషిస్తు­న్న అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌ లిమి­టెడ్‌ కంపెనీ ఈ గ్రామ పరిసరాల్లో పొలాల మట్టిలో బాసిల్లస్‌ కోగులన్స్‌ అనే సూక్ష్మజీవిని రెండేళ్ల క్రితం గుర్తించి, స్థానిక గ్రామ పంచాయతీ ద్వారా రెండు కిలోల మట్టిని తీసుకెళ్లింది. బాసిల్లస్‌ కోగులన్స్‌లోని ఎంజైమ్స్‌ ద్వారా కడుపులో ఆరోగ్యదాయక సూక్ష్మజీవులను, జీర్ణశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడే 42 రకాల ప్రోబయోటిక్‌ ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసి విక్రయిస్తోంది.

లాభాల పంపిణీ ఎలా? 
మన దేశంలోని జన్యు వనరుల వ్యవహారాలను జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) పర్యవేక్షిస్తుంటుంది. సూక్ష్మజీవులు, ఔషధ మొక్కలు, పశుజాతులు వంటి స్థానిక జన్యువనరులను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకునే కంపెనీలు యాక్సెస్‌ అండ్‌ బెనిఫిట్‌ షేరింగ్‌ (ఏబీఎస్‌) యంత్రాంగం ద్వారా సంబంధిత గ్రామ పంచాయతీలకు లాభాల్లో నుంచి కొంత (ఆ ఉత్పత్తుల అమ్మకం ధరలో 0.1–0.5 శాతాన్ని లేదా కొనుగోలు ధరలో 1–5%) మేరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ మొత్తంలో నుంచి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే ఎన్‌బీఏ 5% నిర్వహణ ఖర్చుల కింద తీసుకొని, మిగతా 95% డబ్బును ఆ పంచాయతీకి ఇస్తుంది. 2014 నుంచి అమల్లోకి వచ్చిన ‘నగోయా ప్రొటోకాల్‌’అనే అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక ద్వారా ఏబీఎస్‌ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ విధంగా దాపూర్‌ గ్రామ పంచాయతీ ఖాతాలోకి రూ. 67,69,359 జమ అయ్యాయి.  

ఆ సూక్ష్మజీవి అక్కడ మాత్రమే ఉందా?
బాసిల్లస్‌ కోగులన్స్‌ సూక్ష్మజీవి దాపూర్‌ గ్రామ పరిసరాల్లోని మట్టిలో మాత్రమే ఉందా? అంటే.. ‘అదేం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల నేలల్లోనూ ఇది ఉంటుంది. అయితే, ఆ కంపెనీ ఈ గ్రామం నుంచి తీసుకెళ్లిన మట్టిలో నుంచి సూక్ష్మజీవిని సేకరించింది కాబట్టి వారికి లాభాల్లో వాటా చెల్లించింది’అని మహారాష్ట్ర రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు అధికారులు తెలిపారు. ఇలా వచ్చిన మొత్తాన్ని గ్రామంలో సాధారణ పనుల కోసం వాడకూడదు. ఔషధ మొక్కలు, దేశీ పశు జాతులు, స్థానిక పురాతన వంగడాలు వంటి జీవవైవిధ్యాన్ని, సంప్రదాయ విజ్ఞానాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే పనులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దాపూర్‌ గ్రామస్తులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.

బయోడైవర్సిటీ రిజిస్టరే కీలకం  
జన్యు వనరులను గుర్తించి, నమోదు చేసినప్పుడే వాటిని ఉపయోగించుకునే కంపెనీల నుంచి లాభాల్లో వాటా పొందటం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో ‘పీపుల్స్‌ బయోడైవర్సిటీ రిజిస్టర్‌’(పీబీఆర్‌)ల పాత్ర కీలకం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే జీవవైవిధ్య బోర్డుల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల ద్వారా బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీల(బీఎంసీ)ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని పెద్దలు, సంప్రదాయ విజ్ఞానవంతులు, రైతులు ఇందులో సభ్యులుగా ఉంటారు. బీఎంసీ గ్రామ స్థాయిలోని పరిసరాల్లో ఏయే జన్యు వనరులు ఉన్నాయో గుర్తించి రిజిస్టర్‌లో నమోదు చేస్తుంది.

ఆ రిజిస్టర్‌లోని జన్యు వనరులను ఏ కంపెనీ అయినా ఉపయోగించుకుంటే చట్టప్రకారం లాభాల్లో నుంచి స్థానిక సమాజానికి వాటా పంచాలన్నది నియమం. అయితే, దేశవ్యాప్తంగా 2,76,653 బీఎంసీలు ఏర్పాటైనప్పటికీ, చురుగ్గా పనిచేస్తున్నవి కొన్ని మాత్రమే. 2017–2025 మధ్యకాలంలో విదేశీ కంపెనీల నుంచి రూ. 140 కోట్లు, దేశీయ కంపెనీల నుంచి రూ. 52 కోట్లను స్థానిక సమాజాలకు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement