మధుమేహులకు శుభవార్త. రక్తంలో గ్లూకోజు మోతాదులను చెక్ చేసుకునేందుకు ఇకపై మీరు సూదులతో గుచ్చుకోవాల్సిన పనిలేదు. అలాగని కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా...మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తలు సరికొత్త పరికరం ఒకదాన్ని అభివృద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...
మధుమేహానికి సంబంధించి దేశం ప్రపంచ రాజధానిగా మారుతోందన్న వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. జనాభాలో కనీసం తొమ్మిది శాతం (10.1 కోట్లు) మంది మధుమేహులని 2023లో ఐసీఎంఆర్ నిర్వహించిన ఇండియా డయాబెటిస్ అధ్యయనం స్పష్టం చేసింది. బంధుమిత్రుల్లో పలువురు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూండటాన్ని కూడా చూసి ఉంటాం. ప్రతిరోజూ రక్తంలో చక్కెరల మోతాదులను తెలుసుకునేందుకు సూదితో గుచ్చి రక్తం వెలికితీయడం దాన్ని గ్లూకోజు మానిటర్లపై వేసి చూసుకోవడం ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. రోజు గుచ్చుకోవడం వల్ల కొంత కాలం తరువాత వేలిచివర్లు మొద్దుబారి పోతూంటాయి.
భుజం వెనుకభాగంలో చిన్న మానిటర్‌ను అతికించుకుని సీజీఎంలు అంటే కంటిన్యూయెస్ గ్లూకోజ్ మానిటర్ల ద్వారా రోజంతా లెక్కించవచ్చు కానీ వీటి ఖరీదు ఎక్కువ. ఒక్కో సీజీఎం సెన్సర్ కనీసం రూ.నాలుగు వేల వరకూ ఉంటుంది. పైగా ఈ సెన్సర్‌ను రెండు వారాల తరువాత మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సామాన్యులు వీటిని వాడటం కష్టం. ఈ నేపథ్యంలోనే మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక చవకైన గ్లూకోజ్ మానిటర్ అభివృద్ధిపై పరిశోధనలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అండ్ థిన్ ఫిల్మ్ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్ పరశురామన్ స్వామినాథన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో సీజీఎంలను సరికొత్తగా రూపొందించారు. పలు వినూత్న ఆవిష్కరణలతో, రీయూజబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, అతితక్కువ విద్యుత్తును ఉపయోగించే డిస్‌ప్లే యూనిట్ సాయంతో రూపొందింది ఇది. అతి సూక్ష్మమైన సూదులున్న (గుచ్చుకున్న తెలియనంత చిన్నవి) చిన్న ప్యాచ్‌ను ఉపయోగించి ఈ పరికరం గ్లూకోజ్ మోతాదులను గుర్తిస్తుంది.

స్టార్టప్ సాయంతో మార్కెట్‌లోకి...
మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ సరికొత్త గ్లూకోజ్ మానిటర్‌ను వీలైనంత తొందరగా మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు కూడా జరిగిపోయింది. పరికరం పనితీరును మరింత మెరుగుపరచడంతోపాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంపై ఈ కంపెనీ దృష్టి పెడుతుంది. ఐఐటీ మద్రాస్ కేంద్రంగానే పనిచేస్తూండటం వల్ల ఈ కంపెనీ నమూనాలు తయారు చేయడం, ప్రభుత్వ అనుమతులు పొందడం సులువు అవుతుందని అంచనా. పూర్తిస్థాయిలో తయారైన తరువాత వైద్య పరికరాల తయారీ సంస్థలకు లైసెన్సులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇప్పటికే డిస్‌ప్లే మాడ్యూల్ నిర్మాణం, పరీక్షలు పూర్తయ్యాయి. దీనిపై రెండు భారతీయ పేటెంట్లు కూడా సంపాదించింది ఐఐటీ మద్రాస్. పనితీరు కూడా మెరుగ్గా ఉన్నట్లు పరిశోధన శాలలో జరిగిన పరీక్షలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజలకు ఉపయోగపడితేనే పరిశోధనలకు సార్థకత...
ప్రజల జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకువస్తేనే శాస్త్రవేత్తల పరిశోధనలకు సార్థకత అని ఈ ఉద్దేశంతోనే తాము సీజీఎం తయారీకి పూనుకున్నామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పరశురామన్ స్వామినాథన్ తెలిపారు. మధుమేహ నిర్వహణ అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరమైందని కొత్త పరికరంతో చాలా తక్కువ ఖర్చుతోనే స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర పరికరాల అవసరమేదీ లేకుండా ఎప్పటికప్పుడు గ్లూకోజు మోతాదులను చెక్ చేసకోవచ్చునని ఆయన తెలిపారు తద్వారా పదే పదే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని ఆకాంక్షించారు.


