ఆకాశంలో కమాండ్‌ సెంటర్‌! | Key USAF E-3 AWACS Aircraft Damaged in Iranian Attack | Sakshi
Sakshi News home page

ఆకాశంలో కమాండ్‌ సెంటర్‌!

Mar 30 2026 5:22 AM | Updated on Mar 30 2026 5:22 AM

Key USAF E-3 AWACS Aircraft Damaged in Iranian Attack

ఇరాన్‌ దాడిలో ధ్వంసమైన అవాక్స్‌ విమానం

ఇ–3సీ అవాక్స్‌ ధ్వంసం అమెరికాకు పెద్ద దెబ్బే

సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరంలో ‘ఇ–3సీ సెంట్రీ’ అవాక్స్‌ విమానాన్ని ఇరాన్‌ ధ్వంసం చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే! ఎందుకంటే దాని ప్రత్యేకతలు అలాంటివి. ఇది నిఘా, పర్యవేక్షణ, కమాండ్‌ బాధ్యతలను ఏకకాలంలో నెరవేర్చగలదు. నావిగేషన్, కమ్యూనికేషన్, కంప్యూటేషన్‌ సేవలూ అందించగలదు. ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (అవాక్స్‌)గా పిలుచుకునే ఈ ముందస్తు హెచ్చరికల విమానం గగనతలంలో చక్కర్లు కొట్టే కమాండ్‌ కేంద్రం! దీని తోకపై ఉండే 30 అడుగుల భారీ రాడార్‌ డిస్క్‌ అత్యంత శక్తిమంతమైనది.

ఈ విమానం గాల్లో ఏకధాటిగా 9,300 కిలోమీటర్ల ప్రయాణిస్తూ వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు, క్షిపణుల జాడను పసిగట్టి సెకన్లలో సమాచారం చేరవేస్తుంది. భూ, గగనతల యుద్ధక్షేత్రంలో తాజా పరిస్థితులపై ఇదిచ్చే సమాచారంతోనే సైన్యానికి ఓ స్పష్టత వస్తుంది. దీన్ని సైన్యానికి కళ్లు, చెవులుగా చెప్పవచ్చు! భూ, సముద్రతలాలతో పాటు స్ట్రాటో ఆవరణం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూడా ఈ విమానం పసిగట్టి వెంటనే ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. విమానంలోని 14 కంప్యూటర్‌ తెరలపై తాజా సమాచారాన్ని గ్రాఫిక్‌ల రూపంలో చూడొచ్చు.

తద్వారా క్షిపణులు, బాంబుల ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం వీలవుతుంది. ఆర్‌సీ–135 నిఘా విమానాలు, విమాన వాహననౌకలతో ఏకకాంలో సమాచారం పంచుకుంటూ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. బోయింగ్‌ తమ 707–320బీ విమానాన్ని ఆధునీకరించి ఇ–3సీ సెంట్రీ విమానంగా రూపొందించింది. ఒక్కో విమానం ఖరీదు రూ.6,640 కోట్లు. దశాబ్దాల క్రితం అమెరికా అమ్ములపొదిలో ఇవి 30 దాకా ఉండేవి. వీటి తయారీని బోయింగ్‌ నిలిపేయడంతో ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. 46 మీటర్ల పొడవైన ఈ విమానం గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భారీ నిఘా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లు అమర్చిన ఈ విమానం బరువు 1.57 లక్షల కిలోలు. ఇది గరిష్టంగా 29,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement