ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై మోదీ ధ్వజం
అధికారం దక్కితే జేబులు నింపుకోవడమే
ఈసారి కేరళలో ఎన్డీఏ విజయం తథ్యం
యువత, మహిళలు, రైతులు ఆదరిస్తున్నారు
పాలక్కాడ్ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం
పాలక్కాడ్/త్రిసూర్: సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అసలైన ఎ–టీమ్. అంతే తప్ప ఎవరికీ బి–టీమ్ కాదు’’ అని తేల్చిచెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చిచెప్పారు. కేరళ ప్రజల మద్దతు, ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందని అన్నారు.
కేరళకు సేవ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ‘మోదీ గ్యారంటీ’ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి ఎన్డీయేకు ఆదరణ పెరుగుతోందన్నారు. కేరళ యువత, మహిళలు, రైతన్నలు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తున్నారని వెల్లడించారు.
అన్ని కుంభకోణాలపై దర్యాప్తు
కేరళను ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోదీ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆ రెండు కూటముల మధ్య అవగాహన ఉంది. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చి, జేబులు నింపుకొనేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ అక్రమాలు బయటకు వస్తాయని బెదిరిపోతున్నాయి. మేం గెలిచాక ఆ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తాం’’ అని ప్రకటించారు.
ఆ సొమ్మంతా కక్కిస్తాం
పదేళ్ల ఎల్‌డీఎఫ్ పాలనలో కేరళ రుణ భారం మూడు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లు దాటేసిందరి మోదీ చెప్పారు. ‘‘ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అది ఎల్‌డీఎఫ్ నేతల జేబుల్లోకే వెళ్లింది. మేం రాగానే ఆ సొమ్మంతా కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తాం. కేరళ ప్రగతి కోసం కేంద్రం భారీగా నిధులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే రాష్ట్రానికి మేమే ఎక్కు నిధులు విడుదల చేశాం’’ అని చెప్పారు. ‘‘మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణంపై దృష్టి పెట్టాం.
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి పార్లమెంట్‌లో ‘నారీశక్తి వందన్ అధినియమ్ చట్టం’ తెచ్చాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలేమో అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలుతున్నారు’’ అని మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. దానివల్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయుల ప్రాణాలకు ముప్పుందన్నారు.
త్రిసూర్‌లో భారీ రోడ్ షో
కేరళలోని త్రిసూర్‌లో మోదీ ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, కాషాయం రంగు తలపాగా ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు.
డోలు వాయించిన మోదీ
పాలక్కాడ్ సభలో మోదీ కేరళ సంప్రదాయ డోలు వాద్యం ‘చెండా’పై దరువేశారు. దాంతో సభికులు హర్షధ్వానాలు వెలిబుచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక దాకా జనం రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. వేదికపై చెండాను వాయించడానికి ఆయన కర్రలు చేతుల్లోకి తీసుకోగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన అర నిమిషం పాటు కొన్ని బీట్లు వాయించి అలరించారు. సభలో ఇద్దరు చిన్నారులు పెయింటింగ్‌లను పట్టు కొని ఉండటం గమనించిన మోదీ, వా టిపై వాళ్లు పేర్లు, చిరునామా రాయాలని వారికి సూచించారు. వారికి తాను ప్రత్యు త్తరం పంపుతానన్నారు. ఆ పెయింటింగులను తీసుకో వాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. సభలో మైక్‌కు సంబంధించిన పరికరం నుంచి పొగలు రావడం కాసేపు కలకలం సృష్టించింది.
కష్టకాలంలోనూ సత్తా చాటుతున్నాం: మన్ కీ బాత్‌లో మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభాల వంటి క్లిష్ట పరిస్థితులను 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సహకారంతో దేశం దీటుగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యుద్ధాల వేళ స్వార్థ రాజకీయాలకు తావులేదని, పుకార్లను నమ్మవద్దని ఆదివారం మన్ కీ బాత్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పీఎం సూర్య ఘర్ పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోందని, ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. జల సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలన్నారు. పురాతన రాతప్రతులను సంరక్షించేందుకు ఉద్దేశించిన ’జ్ఞాన్ భారతం సర్వే’లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


