ఇరాన్‌పై యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ | Iran Strike On Prince Sultan Air Base Destroyed US Air Force E-3 Sentry Airborne, Check Out Complete Details Inside | Sakshi
Sakshi News home page

అవాక్స్‌ విమానం ధ్వంసం.. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ

Mar 29 2026 4:54 PM | Updated on Mar 29 2026 6:14 PM

Iran strike on Prince Sultan air base destroyed US Air Force E-3 Sentry Airborne

రియాద్‌: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధంలో శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారం అందించే ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ విమానాన్ని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విమానాన్ని మార్చి 27న రియాద్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి లక్ష్యంగా చేసిందని ది జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడిలో 10–12 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

దాడిలో ధ్వంసమైన విమానం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నష్టం తీవ్రంగా ఉండటంతో, దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ-3సెంట్రీ ఎయిర్‌బోర్న్‌ కేవలం విమానం మాత్రమే కాదు. యుద్ధరంగంలో అమెరికాకు వెన్నెముకలాంటిది. తరచుగా ‘ఎగిరే కమాండ్ సెంటర్’గా వర్ణించబడే ఈ విమానం వందల మైళ్ల మేర గగనతలాన్ని పర్యవేక్షిస్తూ, దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దళాలకు ముందస్తు సమాచారం అందిస్తుంది. నిఘా నుండి అడ్డుకోవడం వరకు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. 

ఈ స్థావరంపై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘రోరింగ్ లయన్’ వంటి సైనిక ఆపరేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి అనేక సార్లు దాడులు జరిగాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన మరో క్షిపణి దాడిలో 14 మంది గాయపడ్డారు. ఈ-3 సెంట్రీ  ఎయిర్‌బోర్న్‌ ధ్వంసం కావడం చాలా పెద్ద విషయం అని మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జాన్ జేవీ వెనబుల్ వ్యాఖ్యానించారు. ‘గల్ఫ్ ప్రాంతంలో ఏం జరుగుతుందో గమనించే సామర్థ్యానికి, అలాగే అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండే వీలుకు ఇది విఘాతం కలిగిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు.

 

అమెరికా ఖరీదైన విమానాలపై ఇరాన్ దాడులు
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. 21 రోజుల యుద్ధంలో కనీసం 17 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కూలిన విమానాల వివరాలు
ఈ దాడుల్లో ఎఫ్‌‑35 స్టెల్త్ ఫైటర్, ఎఫ్‌‑18 జెట్, అలాగే అత్యంత కీలకమైన ఈ‑3 సెంట్రీ అవాక్స్‌ వంటి విమానాలు ఉన్నాయి. ఇవి అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన, వ్యూహాత్మక ఆస్తులుగా గుర్తింపు పొందాయి. 
 
ధర అంచనాలు
ఎఫ్‌‑35 స్టెల్త్ ఫైటర్: ఒక్కో విమానం ధర సుమారు 80–100 మిలియన్ డాలర్లు  (రూ.6,600– రూ.8,300 కోట్లు).  
ఎఫ్‌‑18 జెట్: ధర సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ.5,000 కోట్లు).
ఈ‑3 సెంట్రీ అవాక్స్‌ : అప్‌గ్రేడ్‌లతో కలిపి 400 మిలియన్ డాలర్లు  (రూ.3,000 కోట్లు)

ఆర్థిక ప్రభావం
ఈ నష్టాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆర్థిక దెబ్బ తగిలింది. ఒక్కో విమానం ధర వందల మిలియన్ల డాలర్లలో ఉండటంతో, మొత్తం నష్టం విలువ విపరీతంగా పెరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement