ఇక భూతల యుద్ధం! | US Sends 3500 Marines to West Asia | Sakshi
Sakshi News home page

ఇక భూతల యుద్ధం!

Mar 30 2026 5:06 AM | Updated on Mar 30 2026 5:06 AM

US Sends 3500 Marines to West Asia

పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా జవాన్లు  

ఇప్పటికే సిద్ధంగా 50 వేల మంది

మరో 10 వేల మంది తరలింపు!

ఎందరొచ్చినా మసి చేస్తాం: ఇరాన్‌

అమెరికా స్థావరాలపై నిప్పుల వర్షం

అమెరికా కీలక నిఘా విమానం, ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్‌ ధ్వంసం

దుబాయ్‌/టెహ్రాన్‌: పశ్చిమాసియాలో యుద్ధం భూతలానికి విస్తరించేలా కనిపిస్తోంది. ముఖాముఖి పోరుకు అమెరికా, ఇరాన్‌ సై అంటే సై అంటున్నాయి. అమెరికా ఇప్పటికే వేలాది మంది జవాన్లను పశ్చిమాసియాకు తరలించింది. 3,500 మంది మెరైన్లు, సైనికులు ఆదివారం గల్ఫ్‌కు చేరుకున్నారు. ఇరాన్‌తో ప్రధాన భూభాగంతో పాటు ఖర్గ్‌ ద్వీపంపై దాడి చేసేంత దూరంలోనే మోహరించారు. పశ్చిమాసియాలో 50 వేల మందికి పైగా అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.

వీరికి తోడు మరో 10 వేల మంది సైనికులను త్వరలో పశ్చిమసియాకు తరలించాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇరాన్‌ కూడా వెనక్కు తగ్గడం లేదు. తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది శవాలేనంటూ హెచ్చరించింది. ఇరాన్‌ మిస్సైల్‌ లాంచింగ్, గగనతల రక్షణ వ్యవస్థలు, నౌకా మార్గాలను దెబ్బకొట్టి వెన్ను విరవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్‌కు ఆర్థికంగా ఆయువుపట్టైన ఖర్గ్‌ దీవిని దిగ్బంధిస్తే విధి లేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. ట్రంప్‌ బెదిరింపులతో సరిపెట్టబోరని, తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌  చెప్పారు. ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్‌ పరిస్థితి నరకప్రాయం అవుతుందని హెచ్చరించారు. 

దుబాయ్‌లో రెండు స్థావరాలపై దాడులు 
పశ్చిమాసియా యుద్ధం 30 రోజులకు చేరింది. దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 3 వేల మందికిపైగా మరణించారు. ఆదివారమూ పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భారీ దాడులకు దిగింది. పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. దాడుల్లో అల్‌ అరబీ టీవీ చానల్‌ కార్యాలయం ధ్వంసమైంది. ప్రసారాలు ఆగిపోయాయి. ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ సైన్యం క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్‌పై కూడా దాడులు కొనసాగించింది. క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి.

యెమెన్‌ హూతీలు ఇరాన్, లెబనాన్‌   హెజ్‌»ొల్లాతో కలిసి ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడ్డారు. జోర్డాన్‌లో అమెరికా ఎయిర్‌బేస్‌తోపాటు ఇజ్రాయెల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు ఇరాన్‌ వెల్లడించింది. దుబాయ్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపైనా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులకు పాల్పడింది. ఒక స్థావరంలో 400 మంది, మరోదాంట్లో 100 మంది జవాన్లున్నారు. వారిలో చాలామంది దాడిలకు బలైనట్టు ఇరాన్‌ సైన్యం చెబుతోంది. మృతదేహాలను, క్షతగాత్రులను చేరవేస్తూ అంబులెన్స్‌లు బిజీగా తిరగాయని పేర్కొంది. 

అమెరికాకు తీవ్ర నష్టం 
ఇరాన్‌ దాడుల్లో అమెరికాకు అనూహ్య నష్టం జరిగింది. సౌదీ అరేబియాలో ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక అవాక్స్‌ నిఘా విమానంతో పాటు పలు రీఫ్యూయలింగ్‌ విమానాలు ధ్వంసమయ్యాయి. అవాక్స్‌ విమానాన్ని అమెరికా సైన్యానికి అతిపెద్ద ఆస్తిగా పరిగణిస్తారు. దాడిలో అది పనికిరాకుండా పోయింది. అమెరికాకు ఎంక్యూ–9 డ్రోన్లతో పాటు ఎఫ్‌–16 యుద్ధ విమానం కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఇజ్రాయెల్‌ వర్సిటీలు, గల్ఫ్‌లోని అమెరికా వర్సిటీల శాఖలపైనా దాడులు చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. 

కీలకమైన అణు నిరాయు«దీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి  తప్పుకోవాలని ఇరాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టింది. అణు శక్తి విషయంలో కొత్తగా అంతర్జాతీయ ఒప్పందం తేవాలని ఇరాన్‌ కోరుతోంది. 

⇒  పశ్చిమాసియాలో శాంతి సాధనే ధ్యేయంగా పాకిస్తాన్‌లో ఆదివారం కీలక సమావేశం జరిగింది. సౌదీ అరేబియా, ఈజిప్టు, తుర్కియే, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు.

మేం వెయిటింగ్‌ : ఇరాన్‌ స్పీకర్‌ 
తమ భూతలంలోకి అమెరికా సేనల రాక కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఖలిబాఫ్‌ ప్రకటించారు. ‘‘అమెరికా, దాని మిత్రదేశాల సైన్యాన్ని మసి చేస్తాం. ఆ దేశాలను శాశ్వతంగా శిక్షిస్తాం’’ అని హెచ్చరించారు. ఇరాన్‌ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందన్నారు.  

ఇరాన్‌కు రష్యా సాయం: జెలెన్‌స్కీ
సౌదీలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరంపై ఇరాన్‌ దాడి వెనుక రష్యా హస్తముందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఎయిర్‌బేస్‌కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రష్యానే అందజేసిందన్నారు. ‘‘అమెరికా స్థావరాలపై దాడులకు రష్యా ముమ్మాటికీ సహరిస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా సమాచారం చేరవేస్తోంది’’ అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement