సొర చేపలకు ఆహారంగా అమెరికా సైనికులు?! | Iran warns US troops would be food for sharks | Sakshi
Sakshi News home page

సొర చేపలకు ఆహారంగా అమెరికా సైనికులు?!

Mar 29 2026 9:12 PM | Updated on Mar 29 2026 9:12 PM

Iran warns US troops would be food for sharks

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధానికి నెల రోజుల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు ఇరాన్‌ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

ఇరాన్‌ సైన్యం ఆదివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యాన్ని పర్షియన్‌ గల్ఫ్‌లోకి పంపితే వారు ‘సొరచేపలకు ఆహారంగా’ మారతారని హెచ్చరించారు. ఇరాన్‌ సైనికులు ఈ అవకాశాన్ని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ట్రంప్‌ను ‘ఇజ్రాయెల్‌ నాయకత్వానికి బానిస’గా అభివర్ణించారు.

అదే సందర్భంలో ట్రంప్‌ను ‘ప్రపంచ దేశాల మధ్య అత్యంత అసత్యవాది అధ్యక్షుడు’గా పిలుస్తూ, ఆయన నిర్ణయాలు స్థిరంగా లేవని విమర్శించారు. ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారని, వెంటనే యుద్ధం చేయాలని నిర్ణయిస్తారని ధ్వజమెత్తారు. ట్రంప్‌పై ఇజ్రాయెల్‌ గూఢచారి సంస్థ మోసాద్‌ ఒత్తిడి పెంచుతోందన్నారు. ట్రంప్‌ గత సంబంధాలు, ప్రత్యేకంగా జెఫ్రీ ఎప్‌స్టిన్‌ కేసుతో అనుబంధం కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగిందని ఆరోపించారు.

అమెరికా ఇరాన్‌లో భూతల దాడులకు సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి. ఖార్గ్‌ దీవి, హోర్ముజ్‌ జలసంధి సమీప ప్రాంతాల్లో దాడులు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా తన సైన్యాన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాగేర్‌ ఘలీబాఫ్‌ కూడా ఇరాన్‌ సైన్యం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మిసైళ్ళు, వీధి నిరసనలు, హోర్ముజ్‌ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఈ పరిణామాలు ఇరాన్‌–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్‌ స్పష్టంగా తెలిపినట్లుగా, భూ తల దాడి జరిగితే అది అమెరికాకు ఘోర పరాజయాన్ని తెస్తుందని, పర్షియన్‌ గల్ఫ్‌లోని సొరచేపలు అమెరికా సైనికుల కోసం ఎదురుచూస్తున్నాయని పునరుద్ఘాటిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement