న్యూఢిల్లీ: ‘పశ్చిమాసియా’ సంక్షోభం వేళ భారత్ నుంచి 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని అందుకుంది శ్రీలంక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన ‘పొరుగు దేశాల పాలసీ’లో భాగంగా శ్రీలంకకు ఇంధనాన్ని పంపింది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఆదివారం (మార్చి 29) భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
“పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇంధన సరఫరాల విషయంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. భారత్ త్వరితగతిన సాయం చేసింది.. కృతజ్ఞతలు. నిన్న 38,000 ఎంటీ ఇంధనం కొలంబోకు చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోఆర్డినేషన్‌కు కూడా ధన్యవాదాలు” అని దిస్సానాయకే ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈ వారం ప్రారంభంలో, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై దిస్సానాయకేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. “భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంచే కీలక కార్యక్రమాల పురోగతిని సమీక్షించాం. సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ఇరుదేశాలు సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన‍్న స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాం” అని మోదీ ఎక్స్‌లో తెలిపారు. కాగా, ఈ 38,000 మెట్రిక్ టన్నుల్లో 20,000 ఎంటీ డీజిల్.. 18,000 ఎంటీ పెట్రోల్ ఉన్నాయి.
మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధంపై వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం.
Spoke with PM @narendramodi a few days ago about the fuel supply disruptions Sri Lanka is facing due to the Middle East conflict. Grateful for India’s swift support. 38,000 MT of fuel arrived in Colombo yesterday. My thanks also to EAM @DrSJaishankar for his close coordination.
— Anura Kumara Dissanayake (@anuradisanayake) March 29, 2026


