డీపీఆర్‌కు తుది మెరుగులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2కు సమయం దగ్గరపడుతోంది. కేవలం 19 రోజులే మిగిలింది. స్కిల్ వర్సిటీ ప్రధాన భవనం వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో భారీ వేదిక సహా ఎగ్జిబిషన్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) సహా టీజీఐఐసీ, విద్యుత్, జలమండలం, హెచ్‌ఎండీఏ, పోలీసు, ఇతర అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు తీస్తోంది. ప్రతి రోజూ ఎవరో ఒకరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నిజానికి నవంబర్ 15 నాటికే సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు మీర్‌ఖాన్‌పేట ప్రధాన రోడ్డు నుంచి స్కిల్ వర్సిటీ సభాస్థలికి చేరుకునే మార్గం పనులు మొదలు కాకపోవడంపై ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎస్ ఆదేశాలతో వందకుపైగా ఇటాచీలు, జేసీబీలతో రోడ్డు పనులు చేస్తున్నారు. అక్కడే క్రషర్‌ను ఏర్పాటు చేసి, రోడ్డు మార్గంలో తవ్వి తీసిన మెటల్‌ను ఉపయోగించి కంకర, రోబోశాండ్ తయారు చేసి, అదే పనులకు వాడుతున్నారు.
ఏర్పాట్లు ఇలా..
● డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మీర్‌ఖాన్‌పేటలోని స్కిల్ యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు, 3,500 మందికిపైగా పారిశ్రామిక ప్రతినిధుల హాజరయ్యే అవకాశం ఉంది.
● సమ్మిట్ ఏర్పాట్ల బాధ్యతను ఎఫ్‌సీడీఏకి అప్పగించారు. 72,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు ఎక్స్‌పో హ్యాంగర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
● సమ్మిట్‌లో పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక కట్టడాల నమూనాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. మూడు రోజుల పాటు నాలుగు వేదికలపై వివిధ రంగాలకు సంబంధించి 52 సమావేశాలు నిర్వహించనున్నారు.
● రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్‌సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, కై ్ల మెట్ కాంక్లీవ్ ఉంటాయి.
● రక్షా ఎక్స్‌పోలో భాగంగా రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్‌సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, రోబోటిక్ పరికరాలను ప్రదర్శించనున్నారు.
● ప్రారంభోత్సవంలో భాగంగా డిసెంబర్ 7న వైమానిక విన్యాసాలు సైతం ఉంటాయి.
● రక్షా ఎక్స్‌పో కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 575 సంస్థలను ఆహ్వానించగా, 49 సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలిసింది.
● యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాలకు సంబంధించిన ఇండియా జాయ్–2026 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
● స్టార్టప్‌ల కోసం పెవిలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 136 స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
● ఫార్మా, లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి 60 కంపెనీల ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
● వ్యవసాయం, అనుబంధ రంగాల పెవిలియన్‌లో ఆధునిక సాగుపద్ధతులు, డ్రోన్లు, పాడి, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
● ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పులు సహా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 8న ప్రత్యేక కాంక్లీవ్ నిర్వహించనున్నారు.
● సదస్సుకు దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
మిగిలింది 19 రోజులే..
గ్లోబల్ సమ్మిట్‌కు సమీపిస్తున్న గడువు
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో భారీ ఏర్పాట్లు
మీర్‌ఖాన్‌పేట నుంచి సభాస్థలి వరకు రోడ్డు విస్తరణ
వందకుపైగా జేసీబీలతో నిరంతరాయంగా పనులు
అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునిక నగరంగా భారత్ ఫ్యూచర్‌సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జిల్లాలోని ఏడు మండలాలు, 71 గ్రామాలు, 867 చదరపు కిలోమీటర్లు, 1.80 లక్షల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్‌సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసింది. ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి, వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. 2047 అవసరాలకు తగ్గట్లు డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. సింగపూర్‌కు చెందిన శ్రీడీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. సమ్మిట్ సమయం దగ్గర పడుతుండటంతో ఈ సంస్థ సమగ్ర మా స్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంలో బిజీగా మారింది. సమ్మిట్ వేదికగా ఈ డీపీఆర్‌ను ఆవిష్కరించనున్నారు.


