పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

Nov 18 2026 11:07 AM | Updated on Nov 18 2026 11:07 AM

రామగిరి (నల్లగొండ): నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన గండికోట జగదీష్‌ (17) నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతూ, కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతుండటంతో మంగళవారం ఉదయం పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ముగిసిన అనంతరం హాస్టల్‌ గదికి చేరుకున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో రూమ్‌మేట్స్‌ మెస్‌కు వెళ్తూ అతడిని కూడా రమ్మని పిలిచారు. తాను కాసేపు తర్వాత వస్తానని జగదీష్‌ చెప్పడంతో వారంతా భోజనానికి వెళ్లిపోయారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత స్నేహితులు తిరిగి గది వద్దకు వచ్చి చూడగా లోపలి నుంచి తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి గది వెంటిలేటర్‌ పైనుంచి లోపలికి తొంగి చూశారు. బట్టలు ఆరేసే తాడుతో జగదీష్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే విద్యార్థులు గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి కిందకు దించి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పరీక్షల ఒత్తిడితో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మాడ్గులలో విషాదం

ఆమనగల్లు: జగదీశ్‌ ఆత్మహత్యతో స్వగ్రామం మాడ్గులలో విషాదం నెలకొంది. ఉన్నత చదువులు చదివి తమను చూసుకుంటాడనుకున్న ఒకే ఒక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. జగదీశ్‌ తల్లి లక్ష్మమ్మ మూడు రోజుల క్రితం పాముకాటుకు గురై మాల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జగదీశ్‌ ఆత్మహత్య సమాచారం తెలియడంతో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, తల్లిదండ్రులు కలిసి నల్లగొండకు బయలుదేరి వెళ్లారు. తల్లి లక్ష్మమ్మతో రెండు రోజుల క్రితం జగదీశ్‌ ఫోన్‌లో మాట్లాడి పరీక్ష సరిగా రాయలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement