తుర్కయంజాల్: కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని.. వీటిని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జాజాల రుద్ర కుమార్ అధ్యక్షతన తుర్కయంజాల్‌లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం ఐక్య పోరాటాలే మార్గమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఐక్యంగా ముందుకు వచ్చి డిసెంబర్ 1,2,3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి డి.జగదీష్, కోశాధికారి కవిత, ఉపాధ్యక్షుడు డి.కిషన్, సభ్యులు ఎన్.రాజు, మల్లేశ్, దేవేందర్, పెంటయ్య, స్వప్న, ఎల్లేశ్, వీరయ్య, ఎం.సత్యనారాయణ, పి.శ్రీనివాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్


