అంతర్రాష్ట్ర రవాణాదారుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర రవాణాదారుడి అరెస్ట్‌

Nov 18 2026 11:07 AM | Updated on Nov 18 2026 11:07 AM

అంతర్రాష్ట్ర రవాణాదారుడి అరెస్ట్‌ తలకొండపల్లిలో పట్టివేత సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

సులువుగా డబ్బు సంపాదించేందుకు వక్రమార్గాన్ని ఎంచుకున్నారు.. గంజాయి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు.. వేర్వేరు ఘటనలో మొత్తం ఐదుగురిని కటకటాల్లోకి నెట్టారు..

గంజాయి రవాణా చేసి..

పోలీసులకు చిక్కి

ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్‌ వద్ద గంజాయిని తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 137 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జానకిరామ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తలకొండపల్లి మండల సమీపంలోని ఎక్స్‌రోడ్‌ వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేసి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 137 గ్రాముల గంజాయి లభించింది. కొంగర తండాకు చెందిన కోల రాహుల్‌, దేవరి శివ, గుమ్మడివల్లి గ్రామానికి చెందిన సాయికుమార్‌ను అరెస్టు చేశారు. బైక్‌ను, మూడు సెల్‌ఫోన్‌లను సీజ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ శేఖర్‌ ఉన్నారు.

పహాడీషరీఫ్‌: అంతర్రాష్ట్ర గంజాయి రవాణాదారుడిని చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బాలాపూర్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్‌కు చెందిన అహ్మద్‌ ఎమాద్‌ మహ్మద్‌ (20) పాన్‌ షాప్‌లో పని చేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కొత్తపేట బావజీర్‌ కాలనీకి చెందిన గంజాయి పెడ్లర్‌ ఇబ్రహీం బిన్‌ సలీం బామర్‌తో పరిచయం పెంచుకున్నాడు. అహ్మద్‌ తీసుకొచ్చిన గంజాయిని ఇబ్రహీం అవసరమైన వారికి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఇబ్రహీం ఆదేశానుసారం అహ్మద్‌ ఒడిశాలోని బేర్హంపూర్‌కు వెళ్లి సామ్యూయెల్‌ అనే సప్లయిర్‌ వద్ద 21 కిలోల డ్రై గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అతనికి ఇచ్చేందుకు తన ఇంట్లోనే నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న చార్మినార్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సి.యాదేందర్‌, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.నాగరాజు నేతృత్వంలో ఎస్‌ఐలు కె.రామారావు, ఎం.మహేశ్‌, కె.శివకుమార్‌ బృందం సోమవారం రాత్రి దాడి చేసి అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.10.50 లక్షల విలువైన 21 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీం, సామ్యూయెల్‌ పరారీలో ఉన్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

శంకర్‌పల్లి: యువతకు గంజాయి సరఫరా చేస్తున్న పాత నేరస్తుడిని శంకర్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొ రిమాండ్‌కు తరలించారు. సీఐ రుధ్వీర్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిపిన దాడుల్లో ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడగా వారిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. వీరికి సరఫరా చేసింది పాత నేరస్తుడైన వజీర్‌ అని తెలడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం వజీర్‌ని అదుపులోకి తీసుకొని చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్‌ నిమిత్తం సంగారెడ్డి జిల్లా కంది జైలుకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement